Telangana Rains: తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి- మోస్తరు వర్షాలు.. ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం అందించారు. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఆ తరువాత ఈ వాయుగుండం తుపానుగా మారి 'దానా' అని పేరు పెట్టారు. ఈ దానా తుపాను నేటి రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశముందని వెల్లడించారు. దానా తుపాను ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషాలో కూడా తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ప్రధానంగా రెండు జిల్లాలపై దానా తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుందని చెప్పారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలకు అవకాశముందని చెప్పారు. శుక్ర, శని, ఆదివారాల్లో తెలంగాణలోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని చెప్పారు. ఈ జిల్లాలకు శని, ఆదివారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారుల సూచన
హైదరాబాద్‌లో ఉదయం పొడి వాతావరణం ఉండబోతుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉదయం మేఘాలు వస్తూ ఉంటాయని, మధ్యాహ్నం కాస్త ఎండ పడవచ్చు,కానీ సాయంత్రానికి చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. దానా తుపాను ప్రభావంతో నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నేడు శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్నం,తిరుపతి,చిత్తూరు,అన్నమయ్య,పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంట గంటకు 80-100కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.