LOADING...
Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత
ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత

Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 11, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో చమురు, గ్యాస్‌ నిల్వలు తగినంతగా ఉన్నాయని చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో గ్యాస్‌ కొరత కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం ఇప్పుడు అయోధ్యలోని ఆలయ కార్యకలాపాలపైనా పడింది. ఎల్‌పీజీ సిలిండర్ల కొరత కారణంగా అమావా ఆలయంలో నిర్వహించే రామ్‌ రసోయీ (అన్నదాన కేంద్రం)ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అన్నదాన కేంద్రం వద్ద నోటీసులు కూడా అంటించారు.

Details

నగరాల్లో హోటల్‌, రెస్టారెంట్‌ రంగంపై ప్రభావం

ఇక వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కొరత దేశంలోని పలు నగరాల్లో హోటల్‌, రెస్టారెంట్‌ రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. ముంబయి, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడినట్లు సమాచారం. ఎల్‌పీజీ కొరత కారణంగా ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్‌ను కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ బ్లాక్‌ మార్కెట్‌ విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. గ్యాస్‌ సిలిండర్‌ బుకింగ్‌ మధ్య వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అలాగే వాణిజ్య సిలిండర్ల సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

Details

సంక్షోభం కారణంగా వంటగ్యాస్‌ కొరత

ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా వంటగ్యాస్‌ కొరత ఏర్పడుతుండటంతో తమ హోటళ్లలో సేవలపై ప్రభావం పడిందని ప్రముఖ హోటల్‌ సంస్థ ITC లిమిటెడ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లోని తమ హోటళ్లలో రేపటి నుంచి మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ సేవలను ప్రారంభిస్తామని తెలిపింది.

Advertisement