Ticket Booking: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తత్కాల్ టికెట్ బుకింగ్‌కు నేటి నుంచి కొత్త ఓటీపీ నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ 1వ తేదీతో ప్రభుత్వ, బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించిన కొన్ని కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి. అదేవిధంగా రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ వ్యవస్థపై కొత్త నిబంధనలు నేటి నుంచి అమలులోకి వస్తున్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వెంటనే ప్రయాణం చేయాల్సిన వారు సాధారణంగా తత్కాల్ బుకింగ్‌ను ఉపయోగిస్తారు. ధర కొంచెం ఎక్కువైనా వెంటనే టికెట్ లభించడమే ఈ సిస్టమ్ ప్రత్యేకత. అయితే ఇప్పుడు ఈ తత్కాల్ టికెట్లపై కీలకమైన మార్పులు తీసుకువచ్చింది భారతీయ రైల్వే. ఇక నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ప్రతి ప్రయాణికుడూ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి.
Details
అక్రమ పద్ధతిని అరికట్టడానికే ఈ ప్రయత్నం
ఓటీపీ సరిగా వెరిఫై అయిన తర్వాతే టికెట్ బుకింగ్ కొనసాగుతుంది. ఒకవేళ ఓటీపీ తప్పుగా ఎంటర్ చేస్తే టికెట్ కన్ఫర్మేషన్ జరగదు. టికెట్ బుకింగ్‌లో భద్రత పెంచడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టే ఉద్దేశంతో ఈ కొత్త పద్ధతిని అమలు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు కేవలం తత్కాల్ బుకింగ్‌లకే వర్తిస్తాయి. ఇతర సాధారణ టికెట్లు మాత్రం యథావిధిగా ఐఆర్‌సీటీసీ లాగిన్ ద్వారా ఎలాంటి మార్పులు లేకుండా బుక్ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్‌ల విషయంలో కొంతమంది మోసపూరిత పద్ధతులు అనుసరిస్తున్నారు.
Details
ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థ
దీని వల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు అందడంలో ఇబ్బందులు వస్తున్నాయని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వెరిఫైడ్ ప్రయాణికులు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేలా ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థను కొత్తగా ప్రవేశపెట్టింది రైల్వే శాఖ. దీంతో పారదర్శకత పెరుగుతుందని, మోసాలను అరికట్టగలమని అధికారులు పేర్కొన్నారు.