Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు ఆశావహులను కొంత అయోమయానికి గురిచేశాయి.
ఇటీవల అధికారులు మీ సేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ప్రకటన వెలువడిన వెంటనే శనివారం అనేక మంది దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు.
అయితే కొద్దిగంటలకే ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ఆప్షన్‌ను అధికారులు తొలగించారు.
పౌరసరఫరాల శాఖ స్పష్టంగా తెలిపిన ప్రకారం, కొత్త రేషన్ కార్డుల కోసం ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు.
సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, అందుకే దరఖాస్తుదారులు మాన్యువల్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
Details
మార్పులు, చేర్పులు మీ సేవాలో దరఖాస్తు చేసుకొనే అవకాశం
ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం ద్వారా కొన్ని దరఖాస్తులు స్వీకరించామని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ వార్డు సభలు ఏర్పాటయ్యే వరకు వేచి ఉండాలని సూచించారు.
అయితే రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు కోరే వారు మాత్రం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు రెండున్నర లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ మేరకు వార్డు సభల ద్వారా లేదా సంబంధిత కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించుకోవచ్చని అధికారులు సూచించారు.
Details
ప్రజాపాలన ద్వారా 5.40 లక్షల దరఖాస్తుల స్వీకరణ
గ్రామ సభల ద్వారా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించగా, గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ పాత దరఖాస్తుల అర్హుల జాబితానే విడుదల చేయలేదు.
ఫిబ్రవరి ప్రారంభంలో ఈ ప్రక్రియ చేపడతామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని సమాచారం.
హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో, ప్రజాపాలన ద్వారా 5.40 లక్షల దరఖాస్తులు అధికారులు స్వీకరించారు.
అయితే వీటిలో అర్హులను వార్డు సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది. జాబితాలో పేరులేని వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు వార్డు సభల్లో లేదా సంబంధిత కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.
గ్రేటర్ పరిధిలో వార్డు వారిగా సమావేశాలు నిర్వహించి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎప్పుడు స్వీకరిస్తారనే అంశంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.