ప్రభుత్వ బంగ్లా కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలన్న పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాఘవ్ చద్దా పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించనుంది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన ఉత్తర్వులను అక్టోబర్ 6న పాటియాలా హౌస్ కోర్టు సమర్థించింది. చద్దా వెంటనే బంగ్లాను ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా బంగ్లాను ఖాళీ చేయవద్దని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కూడా కోర్టు ఉపసంహరించుకుంది.
ప్రభుత్వ బంగ్లా వివాదం ఇదే..
ప్రస్తుతం పంజాబ్ నుంచి రాజ్యసభలో రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చద్దా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. రాజ్యసభ ఎంపీ అయిన చద్దాకు సెక్రటేరియట్ పొరపాటున పండరా రోడ్‌లోని టైప్-7 బంగ్లాను కేటాయించింది. అయితే నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఫ్లాట్‌లను మొదటిసారి ఎంపీలకు కేటాయించరు. రాజ్యసభ సెక్రటేరియట్ తన తప్పును గుర్తించిన వెంటనే, బంగ్లాను ఖాళీ చేయమని రాఘవ్ చద్దాకు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఒకసారి బంగ్లా కేటాయిస్తే తాను 6 ఏళ్ల పాటు ఎంపీగా ఉంటానని, అప్పటి వరకు బంగ్లాను ఖాళీ చేయలేనని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుల దాకా వెళ్లింది.