
Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు
ఈ వార్తాకథనం ఏంటి
దివంగత రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ)లో చీలికను నిరోధించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
2024లోక్‌సభ ఎన్నికలలో ఓట్లను చీలకుండా ఉండేందుకు ఎల్‌జేపీకి చెందిన రామ్‌విలాస్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వర్గం, ఆయన తమ్ముడు పశుపతి కుమార్ పారస్ వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావాలని భావిస్తోంది.
అయితే ఈ రెండు వర్గాలు కూడా తమ విభేదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా లేవని తెలుస్తోంది.
కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల చిరాగ్, పశుపతితో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు.
వచ్చే ఎన్నికల కోసం ఇద్దరు కలిసి పనిచేయాలని కోరారు. ఈ క్రమంలో తన వర్గానికి ఆరు ఎంపీ సీట్లు ఇవ్వాలని చిరాగ్ కోరడంతో అందుకు నిత్యానంద్ ససేమీరా అన్నారు. దీంతో నిత్యానంద్ రాయబారం విఫలమైంది.
బీజేపీ
రామ్ విలాస్ మరణం తర్వాత రెండుగా చీలిన పార్టీ
రామ్ విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ 2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది.
అక్టోబర్ 2020లో పాశ్వాన్ మరణించారు. దీంతో రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడు పశుపతి తిరుగుబాటు చేసి తన వర్గంతో ఎన్‌డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఈ పరిణామంతో జూన్ 2021లో ఎల్‌జేపీ రెండుగా చీలిపోయింది.
ఇప్పడు చిరాగ్, పశుపతి వర్గాలు రామ్ విలాస్ కంచుకోట అయిన హాజీపూర్ లోక్‌సభ స్థానం కోసం పోరాడుతున్నాయి.
2019 లోక్‌సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానంలో రామ్ విలాస్ తన తమ్ముడు పశుపతిని పోటీలో నిలపగా, ఆయన గెలుపొందారు. అదే ఎన్నికల్లో చిరాగ్ జముయి స్థానం ఎంపీగా విజయం సాధించారు.
బీజేపీ
జులై 18న జరిగే మెగా మిత్రపక్షాల సమావేశానికి చిరాగ్‌ను ఆహ్వానించిన బీజేపీ
రామ్ విలాస్ పాశ్వాన్‌కు దళిత నాయకుడిగా చాలా గొప్ప పేరుంది. ఆ సామాజికవర్గం మద్దతుతోనే దశాబ్దాలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ఈ క్రమంలో రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన పేరుతో ప్రస్తుతం చిరాగ్, పశుపతి రాజకీయం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో చిరాగ్, పశుపతి వేర్వేరుగా పార్టీలుగా పోటీ చేస్తే దళిత ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది.
దీంతో ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు బాబాయ్, అబ్బాయ్‌ని కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
చిరాగ్ శిబిరాన్ని ఆకర్షించడానికి, బీజేపీ అతనికి కేంద్రమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం.
అలాగే జులై 18న మిత్రపక్షాలతో జరిగే మెగా సమావేశంలో పాల్గొనాల్సిందిగా చిరాగ్ పాశ్వాన్‌ను బీజేపీ ఆహ్వానించింది.