మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 718మంది మయన్మార్ పౌరులు
జాతి ఘర్షణలతో అట్టుకుతున్న మణిపూర్‌కు మయన్మార్ నుంచి అక్రమ వలసలు ఆగడం లేదు. తాజాగా మయన్మార్ నుంచి దాదాపు 718మంది మణిపూర్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులు చెప్పారు. అక్రమంగా వచ్చిన వారిలో 301 మంది పిల్లలు, 208 మంది మహిళలు సహా మొత్తం 718 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపించాలని భద్రతా బలగాలను మణిపూర్ చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి ఆదేశించారు. అంతేకాదు, సరైన ప్రయాణ పత్రాలు లేకుండా 718 మంది మయన్మార్ దేశస్తులు ఎలా భారతదేశంలోకి అనుమతించారనే దానిపై నివేదిక ఇవ్వాలని మణిపూర్ ప్రభుత్వం అస్సాం రైఫిల్స్ నుంచి ఆదేశించింది.
ఆ రెండు రోజుల్లోనే ఈ అక్రమ వలసలు
మయన్మార్ దేశస్తులు శని, ఆదివారాల్లో మణిపూర్‌లోకి ప్రవేశించారని చీఫ్ సెక్రటరీ వినీత్ జోషి చెప్పారు. చందేల్ జిల్లా సరిహద్దు గుండా రాష్ట్రంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చందేల్ జిల్లాలోని ఏడు ప్రాంతాలలో నివసిస్తున్నారని జోషి వెల్లడించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం చెల్లుబాటు అయ్యే వీసాలు, ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్ దేశస్తులు మణిపూర్‌లోకి ప్రవేశించడాన్ని నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని సరిహద్దు రక్షణ దళం అస్సాం రైఫిల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని, అలాగే అటువంటి వ్యక్తులందరి బయోమెట్రిక్‌లు, ఫోటోగ్రాఫ్‌లను తీసుకోవాలని, చందేల్ జిల్లా డిప్యూటీ కమిషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లను చీఫ్ సెక్రటరీ ఆదేశించారు.