Rahul Gandhi: చైనా చొరబాటుపై రాహుల్ విమర్శలు; రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌లో నివాళులు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఆయన కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రత్యేకంగా జరుపుకున్నారు. లద్దాఖ్లోని 14,270అడుగుల ఎత్తులో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున రాహుల్ గాంధీ తన తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ, రాహుల్ గాంధీ ఇలా రాసుకొచ్చారు. ' పాపా, భారతదేశం కోసం మీరు కన్న కలలు మీ జ్ఞాపకాల నుంచి పొంగిపొర్లుతున్నాయి. మీ అడుగులే నా మార్గం' అని రాహుల్ ట్వీట్ చేశారు. దివంగత రాజీవ్ గాంధీకి లద్దాఖ్‌తో పాటు పాంగాంగ్ సరస్సు అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో రాజీవ్ పాంగాంగ్ సరస్సు వద్దుకు వచ్చిన సమయంలో దిగిన ఫోటోలను రాహుల్ షేర్ చేశారు.
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది: రాహుల్
రాహుల్ గాంధీ తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం సరిహద్దులో చైనా చొరబాటు గురించి మాట్లాడారు. చైనా సైన్యం భారత సరిహద్దులోకి ప్రవేశించినట్లు అందరూ అంటున్నారని, కానీ ప్రధాని మాత్రం ఇక్కడికి ఎవరూ రాలేదని చెబుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే భారత భూభాగాన్ని చైనా లాక్కుందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని రాహుల్ చెప్పారు. చైనా సైన్యం ఈ ప్రాంతంలోకి ప్రవేశించిందని, తమ పశువుల మేత భూమిని లాక్కుందని ప్రజలు అంటున్నారని రాహుల్ వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సమయంలో ఇక్కడికి రావాలనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయామని రాహుల్ చెప్పారు. లద్దాఖ్ ప్రజలకు అనేక ఫిర్యాదులు ఉన్నాయని ఆయన అన్నారు. లడఖ్‌కు హోదా ఇవ్వడంతో ప్రజలు సంతోషంగా లేరన్నారు.