LOADING...
Kharge: దేశంలో శాంతి భద్రతా సమస్యలకు బీజేపీ-ఆర్ఎస్ఎస్సే కారణం: మల్లికార్జున ఖర్గే
దేశంలో శాంతి భద్రతా సమస్యలకు బీజేపీ-ఆర్ఎస్ఎస్సే కారణం: మల్లికార్జున ఖర్గే

Kharge: దేశంలో శాంతి భద్రతా సమస్యలకు బీజేపీ-ఆర్ఎస్ఎస్సే కారణం: మల్లికార్జున ఖర్గే

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో చోటుచేసుకుంటున్న శాంతి భద్రతా సమస్యలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)నే కారణమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఆరెస్సెస్‌పై నిషేధం విధించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన స్పష్టం చేశారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలను ఖర్గే తిప్పికొట్టారు. 1948లో మహాత్మా గాంధీ హత్య అనంతరం, ఆరెస్సెస్‌ గురించి సర్దార్‌ పటేల్‌ చేసిన విమర్శలను ఉదహరిస్తూ ఖర్గే వ్యాఖ్యానించారు. సర్దార్‌ పటేల్‌ను"ఉక్కు మనిషి",మాజీ ప్రధాని ఇందిరా గాంధీని"ఉక్కు మహిళ"గా అభివర్ణిస్తూ.. ఇద్దరూ దేశానికి అహర్నిశలు సేవ చేసిన మహానేతలని ఖర్గే అన్నారు. దేశ ఐక్యతను కాపాడేందుకు వారు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.

వివరాలు 

నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ల మధ్య గొప్ప సంబంధాలు

ఆరెస్సెస్‌పై నిషేధం వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, కానీ మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్‌నే సృష్టించిందని ఆయన విమర్శించారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కాలంలో హోంమంత్రి అయిన సర్దార్‌ పటేల్‌, శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీకి లేఖ రాశారని ఖర్గే గుర్తుచేశారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్‌ నెహ్రూ,పటేల్‌ల మధ్య గాఢమైన సంబంధాలు ఉన్నప్పటికీ, వారి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఎప్పుడూ జరిగేవని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

పటేల్‌ చేసిన సేవలను కాంగ్రెస్‌ విస్మరించింది 

దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్‌ను నెహ్రూ ప్రశంసించారని, అలాగే పటేల్‌ కూడా నెహ్రూను దేశానికి ఆదర్శంగా అభివర్ణించారని ఖర్గే తెలిపారు. కశ్మీర్‌ దేశంలో పూర్తిగా విలీనం కావాలని పటేల్‌ కోరుకున్నారని, కానీ అప్పటి ప్రధాని నెహ్రూ ఆ అవకాశాన్ని నిరోధించారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇదిలా ఉంటే, ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. సర్దార్‌ పటేల్‌ దశాబ్దాలపాటు చేసిన సేవలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని ఆరోపించింది.