Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు
విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గురందొరపాలెంలో ఇంటి మొదటి అంతస్థు నుంచి కింద పడిన మీసాల నాగేశ్వరరావు (39) అనే వ్యక్తికి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పుల్ల మెదడు కింది భాగంలోకి చేరడంతో బాధితుడు చూపు కోల్పోయాడు. ఈ విషయమై KGH ఇంచార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ, "12 అంగుళాల చెక్క పుల్ల నాగేశ్వరరావు కుడి కంటికి గుచ్చుకుందన్నారు. ఆ పుల్ల అతని మెదడు దిగువ భాగానికి చేరుకుందన్నా ఆయన.. దీని ఫలితంగా, అతడు వెంటనే తన దృష్టిని కోల్పోయాడని తెలిపారు. జూన్ 5న అతడిని కేజీహెచ్ లో చికిత్స నిమిత్తం చేర్పించారు.
జూన్ 6న ఆపరేషన్
వైద్యులు, నేత్ర వైద్య నిపుణులు, న్యూరో సర్జన్లు, ఆర్థోపెడిక్ వైద్యులు, ఈఎన్‌టీ వైద్యులు, మత్తు వైద్యుల బృందం అతడిని పరీక్షించి పుల్లను తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. స్కానింగ్, రక్తపరీక్షలు, ఎక్స్ రే తదితర అన్ని పరీక్షలు నిర్వహించి, రోగి అంగీకారం తెలపడంతో జూన్ 6న ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతమైంది. రోగికి హై-ఎండ్ యాంటీబయాటిక్స్, ఐసియు కేర్ ఇచ్చారు. అతడిని అబ్జర్వేషన్ లో ఉంచారు. అతని రికవరీ రేటు 100% గా ఉంది.
కళ్ళకు శారీరక గాయం అయిన తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
మీరు అనుకోకుండా మీ కళ్ళకు ఏదైనా జరిగితే ముందుగా, గాయం ఎంత తీవ్రమైందో చూడాలి. ఆ గాయం మిమ్మల్ని చాలా బాధిస్తున్న లేదా మీ దృష్టి మందగించిన లేదా మీ కంటిలో ఏదైనా పడినట్లు అనిపించినా వెంటనే వైద్యుడిని సందర్శించండి. మీ కంటిపై రుద్దడం లేదా ఒత్తడం చెయ్యకండి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. మీ కంటిలో ధూళి లేదా మరేదైనా ఉంటే, దానిని శుభ్రమైన నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోండి. మీరు డాక్టర్‌ను చూసే వరకు మీ గాయపడిన కంటిని శుభ్రమైన గుడ్డ తో కప్పండి. గాయం చిన్నదిగా అనిపించినప్పటికీ, వైద్యుడిని సందర్శించడం మంచిది.