Sandeshkhali case: సందేశ్‌ఖాలీ కేసులో షేక్ షాజహాన్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో పలువురు మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ 55 రోజుల పరారీ తర్వాత గురువారం ఉదయం అరెస్టయ్యాడు. నార్త్ 24 పరగణాస్‌లోని మినాఖాన్ ప్రాంతం నుంచి అరెస్టు చేశామని, ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నట్లు సీనియర్ పోలీసు అధికారి అమీనుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. తృణమూల్ నాయకుడిపై చర్య తీసుకోవడంలో జాప్యం చేసినందుకు రాష్ట్ర పోలీసులను కలకత్తా హైకోర్టు "అతడ్ని అరెస్టు చేయాలి" అని పేర్కొన్న మూడు రోజుల తర్వాత అరెస్టు జరిగింది.
నెల రోజులకు పైగా ఆందోళనలు
సందేశ్‌ఖాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు షాజహాన్ షేక్,అతని మద్దతుదారులపై బలవంతంగా భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. షేక్‌తో పాటు అతడికి సహకరించిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నదీతీర ప్రాంతం నెల రోజులకు పైగా ఆందోళనలతో అట్టుడుకుతోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి అరెస్టుపై వ్యాఖ్యానిస్తూ, "బీజేపీ నిరంతర ఆందోళన కారణంగా మమతా బెనర్జీ ప్రభుత్వం చర్య తీసుకోవలసి వచ్చింది" అని అన్నారు. షాజహాన్ జనవరి 5 నుండి పరారీలో ఉన్నాడు. అతని ప్రాంగణాన్ని సోదా చేయడానికి వెళ్ళిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై ఓ సమూహం దాడి చేసింది.
ఈడీ, సీబీఐ షేక్ షాజహాన్ అరెస్ట్ చేయచ్చు: కలకత్తా హైకోర్టు
షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషన్ తృణమూల్ నాయకుడు, అతని సహచరులకు వ్యతిరేకంగా గిరిజన కుటుంబాల నుండి "లైంగిక వేధింపులు, భూకబ్జా"కు సంబంధించిన 50 ఫిర్యాదులను స్వీకరించింది. భూ సమస్యలకు సంబంధించిన 400 సహా దాదాపు 1,250 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. షాజహాన్‌పై హైకోర్టు మార్చి 4న విచారణ చేపట్టనుంది. తృణమూల్ కాంగ్రెస్ నేతను సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అరెస్టు చేయవచ్చని హైకోర్టు బుధవారం ఆదేశించింది. అయితే, రాష్ట్ర పోలీసులు షేక్‌ను అరెస్టు చేస్తే, రాష్ట్ర పోలీసులు కేసును పలుచన చేసే అవకాశం ఉందని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎస్వీ రాజు ఆందోళన వ్యక్తం చేశారు.