సిక్కిం, బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు
సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌ను ఛేదించింది. ఈ క్రమంలో 24 మందిపై కేసు నమోదు చేసింది. ఈ దాడిలో ప్రభుత్వ అధికారుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో కోల్‌కతా, గ్యాంగ్‌టక్ సహా దాదాపు 50 ప్రదేశాలలో శనివారం ఉదయం దాడులు నిర్వహించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. సిలిగురిలోని పాస్‌పోర్ట్ సేవా లఘు కేంద్రం (పీఎస్‌ఎల్‌కే) సీనియర్ సూపరింటెండెంట్‌తో పాటు మధ్యవర్తిని అరెస్టు చేశారు.
ఇతర రాష్ట్రాల్లోని ముఠాలతో సంబంధాలు
ఈ ప్రాంతంలో నకిలీ పాస్‌పోర్టు ముఠా చురుకుగా ఉన్నట్లు సీబీఐకి సమాచారం అందింది. ఈ సమయంలోనే ఓ వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహకారంతో ముఠాను నడుపుతున్నట్లు కూడా వెల్లడైంది. నకిలీ పత్రాలపై పాస్‌పోర్ట్‌లు జారీ చేయడంలో అధికారి సహాయం చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అనంతరం సీబీఐ బృందం అనుమానిత అధికారి, మధ్యవర్తులపై నిఘా ఉంచారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తున్నట్లు పక్కా సమాచరం అందిన తర్వాత.. 50ప్రాంతాల్లో ఏకకాలంలో దాడు చేశారు. ఈ సందర్భంగా ఈ రాకెట్‌లో ప్రభుత్వ అధికారుల ప్రమేయానికి సంబంధించిన పత్రాలు లభించాయి. అంతేకాకుండా, వీరికి ఇతర రాష్ట్రాల్లో నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారు చేసే ముఠాలకు కూడా సంబంధాలు ఉన్నట్లు సమాచారం.