తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 87చోట్ల టీడీపీ పోటీ: కాసాని జ్ఞానేశ్వర్
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉండటంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే అధినేత జైలులో ఉండి, కష్టకాలంలో టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఈ ప్రశ్నకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుని తాను కలిసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని తాను బాబుకి వివరించినట్లు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు తప్పకుండా జైలు నుంచి బయటకు వస్తారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆమోదించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన: కాసాని
తెలంగాణ ఎన్నికల్లో 87 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు. అయితే చంద్రబాబు ఆమోదించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు. తెలంగాణలో తాము పోటీ చేసే స్థానాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ ప్రచారం చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలంగాణలో టీడీపీ కంటే కాంగ్రెస్ బలంగా లేదని తాము నమ్ముతున్నట్లు చెప్పారు. తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాల? వద్దా అనేది తర్వాత తెలుస్తుందన్నారు.