Chandrababu: విజయవాడలో సహాయక చర్యలు వేగవంతం.. 2,100 మంది సిబ్బందితో బురద తొలగింపు : సీఎం
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. 100 ఫైరింజన్లు, 2100 మంది సిబ్బందితో బురద తొలగింపు పనులు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ ఏ సహాయం అవసరమైతే అక్కడ తక్షణమే సాయమందిస్తామని భరోసా ఇచ్చారు. 62 మెడికల్ క్యాంపులు, 2,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది, పక్లెయిన్లు, టిప్పర్లు వంటి పరికరాలు సాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు 32 మంది ఐఏఎస్‌లు, 179 సీనియర్ అధికారులను సచివాలయాల ఇన్‌ఛార్జులుగా నియమించారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వరదలు రావడానికి కారణం 'బుడమేరు'
వరద బాధితులకు సహాయం అందించడానికి, మంగళవారం రోజున 9,09,191 ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయగా, ఈ రోజు 6 లక్షల ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అదనంగా, 8.50 లక్షల వాటర్ బాటిళ్లు, 3 లక్షల లీటర్ల పాలు, 5 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందించామన్నారు. సీఎం చంద్రబాబు విజయవాడలో వరదల ప్రధాన కారణంగా బుడమేరు వాగును గుర్తించారు. కృష్ణానది, బుడమేరు వాగు కలిసి నగరాన్ని ముంచెత్తాయని, గత ప్రభుత్వ కాలంలో బుడమేరు ప్రాజెక్ట్ పై సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేపు ఉదయానికి వరద పరిస్థితి పూర్తిగా మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.