Modi Speech Highlights: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
Independence Day Modi Speech: 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై చేసిన ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. 2024ఎన్నికలే లక్ష్యంగా మోదీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతిపక్షాలపై కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 2024లో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో తానే జెండాను ఆవిష్కరిస్తానని చెప్పిన మోదీ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేసారు. ప్రియమైన 140కోట్ల కుటుంబ సభ్యులారా అంటూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజలను తన తోటి పౌరులుగా కాకుండా తన కుటుంబ సభ్యులంటూ సంబోధించారు. తద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశారు. 90మినిషాల పాటు సాగిన మోదీ ప్రసంగంలో 26సార్లు ప్రజలను కుటుంబ సభ్యులుగా పేర్కొన్నారు.
ఈ మూడే దేశాన్ని నాశనం చేశాయి: మోదీ
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన జీవిత లక్ష్యంగా మోదీ చెప్పారు. మూడు అంశాలే దేశాన్ని సర్వనాశనం చేశాయని మోదీ చెప్పారు. ఒకటి అవినీతి, రెండు రాజవంశ రాజకీయాలు, మూడోది బుజ్జగింపు రాజకీయాలుగా మోదీ వివరించారు. వారసత్వ రాజకీయాలు ప్రజల హక్కులను కాలరాసినట్లు మోదీ పేర్కొన్నారు. బుజ్జగింపు రాజకీయాలు దేశంపై మాయని మచ్చగా మిగిలిపోయినట్లు వెల్లడించారు. ఈ మూడు దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్లో 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను నా ప్రభుత్వం తొలగించినట్లు మోదీ పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనం 20 రెట్లు పెరిగినట్లు మోదీ చెప్పారు.
రాబోయే ఐదేళ్లు చాలా కీలకం: మోదీ
స్వాతంత్ర్య దినోత్సవ 100ఏళ్ల లక్ష్యాలను చేరుకోవాలంటే రాబోయే ఐదేళ్లు చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. 2047 కలను సాకారం చేసుకోవడానికి వచ్చే ఐదేళ్లే అతిపెద్ద రక్షణ కవచంలా నిలుస్తాయని చెప్పారు. 2047నాటికి అభివృద్ధి చెందిన భారత్ అవతరించడం అనేది కేవలం కల మాత్రమే కాదని, అది 140 కోట్ల మంది భారతీయుల ప్రతిజ్ఞగా మోదీ వివరించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను విజయవంతం చేయడంలో యువత అందిస్తున్న సహకారాన్ని మోదీ ప్రశంసించారు. గత సంవత్సరం బాలిలో జరిగిన జీ20 సమ్మిట్‌లో భారత సాధించిన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకున్నట్లు మోదీ గుర్తుచేశారు.
3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ను తీర్చిదిద్దుతా:మోదీ
ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఆర్థిక వ్యవస్థపై ప్రత్యకంగా మాట్లాడారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10వ స్థానంలో ఉన్నట్లు మోదీ గుర్తు చేశారు. నేడు 140 కోట్ల మంది భారతీయుల కృషితో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించినట్లు పేర్కొన్నారు. దేశంలో అవినీతి అవినీతి భూతాన్ని అరికట్టడం వల్లే బలమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించినట్లు మోదీ స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుందని తాను హామీ ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు. 'అమృత్ కాల్'లో జీవించడం అందరి అదృష్టంగా మోదీ పేర్కొన్నారు. ఈ 'అమృత్ కాల్'లో తీసుకునే నిర్ణయాలు రాబోయే సహస్రాబ్ది ఉత్సవాల లక్ష్యాలను ప్రతిబింబిస్తాయని మోదీ అన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్: మోదీ
కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపే డబ్బు రూ.100లక్షల కోట్లకు పెరిగింది: మోదీ
కేంద్రం నుంచి రాష్ట్రాలకు పంపే డబ్బు రూ.30లక్షల కోట్ల నుంచి రూ.100లక్షల కోట్లకు పెరిగిందని మోదీ చెప్పారు. మున్సిపల్ బాడీలకు రూ.70,000కోట్ల నుంచి రూ. 3లక్షల కోట్లకు చెరుకున్నట్లు పేర్కొన్నారు. పేదల ఇళ్లపై ఇప్పుడు రూ.4లక్షల కోట్లకు పైగా తాము ఖర్చు చేస్తున్నట్లు మోదీ వివరించారు. రైతులకు యూరియా సబ్సిడీపై కేంద్రం దాదాపు రూ.10లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ముద్రా యోజన కింద ప్రజల స్వయం ఉపాధి కోసం 20లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 8 కోట్ల మంది కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారని చెప్పారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం కోసం ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు మోదీ స్పష్టం చేశారు.
మహిళల నేతృత్వంలో అభివృద్ధి: మోదీ
మహిళల నేతృత్వంలోని అభివృద్ధి ప్రాముఖ్యతను ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. చంద్రయాన్ మిషన్‌కు మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారని వివరించారు. పౌర విమానయాన రంగంలో అత్యధిక మహిళా పైలట్‌లను భారత కలిగి ఉందని మోదీ చెప్పారు. 'డ్రెమొగ్రఫీ, డెమొక్రసీ, డైవర్సిటీ' ఈ త్రివేణి భారతదేశం అన్ని కలలను నెరవేస్తుందని మోదీ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనలో తన ప్రభుత్వం చేస్తున్న కృషిని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడ్డారన్నారు.