LOADING...
India-Pakistan: భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!
భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!

India-Pakistan: భారీ వర్షాల ముప్పు.. ముందస్తు హెచ్చరికతో పాక్‌ను అప్రమత్తం చేసిన భారత్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్‌లో భారీ వరదల పరిస్థితులు తలెత్తే అవకాశముందని భావించిన భారత్‌ ముందుగానే హెచ్చరించినట్లు సమాచారం వెలువడింది. పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం, కొన్ని పాక్‌ మీడియా సంస్థల కథనాలను ఉటంకిస్తూ ఈ విషయం స్పష్టమైంది. ఇరు దేశాల మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) ప్రస్తుతం నిలిచిపోయినా, వరదల ముప్పు నేపథ్యంలో పాకిస్థాన్‌ను ముందుగా అలర్ట్‌ చేయడం ద్వారా భారత్‌ మానవతా విలువలను ప్రదర్శించింది.

వివరాలు 

పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ముప్పు

జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తావి నది ఉప్పొంగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ నది ఉద్ధృతమైతే పాకిస్థాన్‌లో వరదలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ పాకిస్థాన్ అధికారులకు ఈ సమాచారం అందజేసిందని అక్కడి ప్రముఖ మీడియా సంస్థలు జియో న్యూస్‌,ది న్యూస్‌ ఇంటర్నేషనల్‌ తదితరాలు నివేదించాయి. ఇంతకు ముందు ఇలాంటి వివరాలు ఇరు దేశాల సింధూ జలాల కమిషనర్లు పంచుకునే వారు. అయితే,ఈసారి నేరుగా దౌత్య కార్యాలయం ద్వారా పాక్‌కు హెచ్చరికలు పంపించినట్లు ఆ కథనాలు స్పష్టం చేశాయి. భారత్‌ అందించిన ఈ సమాచారం ఆధారంగా పాకిస్థాన్ అధికారులు తమ ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపాయి.

వివరాలు 

సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ 

అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు భారత్‌ తరఫున ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని కూడా పేర్కొన్నాయి. ఇక గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని ఫలితంగా, 1960లో అమల్లోకి వచ్చిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దాని ప్రభావంతో వరదలు ముదురాయి. జూన్‌ 26 నుంచి ఇప్పటి వరకు 780 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో వెయ్యి మందికి పైగా గాయపడ్డారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.