
India-China:అమెరికా సుంకాలను ఎదుర్కొనేందుకు భారతదేశం, చైనా కలిసి నిలబడాలి: బీజింగ్ అధికార ప్రతినిధి పోస్ట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగిపోతున్నాయి.
ముఖ్యంగా చైనాపై 104 శాతం టారిఫ్‌లు విధించడమంతే ఈ ఆర్థికంగా అస్థిరత కలిగిన సమయంలో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, చైనా అధికార ప్రతినిధి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, చైనా కలిసి ముందడుగు వేయాలని, న్యూఢిల్లీలోని బీజింగ్ ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు.
ఈమె చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
వివరాలు
వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు
ట్రంప్ విధించిన సుంకాల నేపథ్యంతో భారత్-చైనా మధ్య ఆర్థిక సంబంధాల ప్రాధాన్యతను ఆమె ప్రస్తావించారు.
''ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర సహకారం,పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి. అమెరికా విధిస్తున్న సుంకాల ఒత్తిడితో అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు, తమ అభివృద్ధి సాధించే హక్కును కోల్పోతున్నాయి. ఈ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్-చైనా కలిసి నిలబడాలి. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరు. అంతర్జాతీయంగా సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన విధానాలను అన్ని దేశాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా తీసుకునే రక్షణాత్మక నిర్ణయాలను సమూహంగా వ్యతిరేకించాలి'' అని ఆమె స్పష్టం చేశారు.
వివరాలు
చైనా దిగుమతులపై మొత్తం సుంకాల రేటు 104 శాతం
ఇటీవల ట్రంప్ ప్రభుత్వం భారత్, చైనా తదితర అనేక దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
భారత్‌పై 26 శాతం,చైనాపై అదనంగా 34శాతం టారిఫ్‌లు వసూలు చేయనున్నట్టు ప్రకటించారు.
అంతకుముందే చైనాపై ఇప్పటికే 20శాతం సుంకాలు అమలులో ఉండడంతో,మొత్తం టారిఫ్ రేటు 54 శాతానికి పెరిగింది.
ఈ చర్యలపై ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే పలు ఉత్పత్తులపై 34 శాతం అదనపు సుంకాలను విధించేందుకు సిద్ధమైంది.
దీనిపై ట్రంప్ కాస్త ఘాటుగా స్పందిస్తూ,తమ టారిఫ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.
అయితే చైనా వెనక్కి తగ్గకపోవడంతో,ట్రంప్ మరో 50శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ తాజా నిర్ణయంతో చైనా దిగుమతులపై మొత్తం సుంకాల రేటు 104శాతానికి చేరుకుంది.