LOADING...
India and Oman: ముగిసిన భారత్- ఒమన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు
ముగిసిన భారత్- ఒమాన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు

India and Oman: ముగిసిన భారత్- ఒమన్‌ వాణిజ్య ఒప్పంద చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-ఒమన్‌ల మధ్య 2023లో ప్రారంభమైన సమగ్ర వాణిజ్య ఒప్పందం (CEPA)పై చర్చలు పూర్తయ్యాయని కేంద్ర వాణిజ్య,పారిశ్రామిక శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాదా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కాంగ్రెస్ సభ్యురాలు జేబి మాథర్‌ హిషామ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌, ఒమాన్‌ల మధ్య శతాబ్దాల నాటి స్నేహ బంధం, పరస్పర విశ్వాసం, గౌరవం ఆధారంగా ఉన్న సహకారం కొనసాగుతోంది. 1955లో రెండు దేశాల మధ్య అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పడగా, 2008లో వాటిని వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెంచారు. అప్పటి నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.

వివరాలు 

ఐదేళ్లలో భారత్‌ కుదుర్చుకున్న ఐదు ప్రధాన ఉచిత వాణిజ్య ఒప్పందాలు

అయితే, ఈ ఒప్పందం సంతకం జరిగే తేదీ,సమయం గురించి మంత్రి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గత ఐదేళ్లలో భారత్‌ ఐదు ప్రధాన ఉచిత వాణిజ్య ఒప్పందాలు (FTAలు) కుదుర్చుకుని, మరికొన్ని కొత్త ఒప్పందాలపై ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో కుదిరిన ప్రధాన ఒప్పందాలలో 2021లో అమల్లోకి వచ్చిన భారత్‌-మారిషస్‌ CECPA, 2022లో భారత్‌-యుఎఇ CEPA, భారత్‌-ఆస్ట్రేలియా ECTA, 2024లో భారత్‌-యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (EFTA) TEPA, అలాగే 2025లో సంతకం అయిన భారత్‌-బ్రిటన్‌ CETA ఉన్నాయి. అయితే, భారత్‌-బ్రిటన్‌ ఒప్పందం ఇంకా అమల్లోకి రాలేదు. యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (EFTA) TEPA ఈ ఏడాది చివరినాటికి సభ్య దేశాల ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

కొనసాగుతున్న పలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు 

ఇక భారత్‌ - యూరోపియన్‌ యూనియన్‌ FTA, భారత్‌ - ఆస్ట్రేలియా CECA, భారత్‌ - శ్రీలంక ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం, భారత్‌ - పెరూ FTA, భారత్‌ - చిలీ CEPA, భారత్‌ - న్యూజీలాండ్‌ FTA, భారత్‌ - అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వంటి పలు చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.