India G20 presidency: 'జీ20' అంటే ఏమిటి?కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది?
భారత్ అధ్యక్షతన తొలిసారిగా జరగనున్న జీ20 సదస్సుకు కేవలం 9రోజుల సమయం మాత్రమే ఉంది. దిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్ఠాత్మంగా జీ20 సదస్సును నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అసలు 'జీ20' అంటే ఏమిటి? కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా భారత్ ఏమి ఆశిస్తోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబరు 9,10 తేదీల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. స్వాతంత్య్ర భారత చరిత్రలో మన దేశం ఆతిథ్యమిస్తున్న అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సదస్సు ఇదే కానుంది. గ్లోబల్ జీడీపీలో 85శాతం, వాణిజ్యంలో 75 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న జీ20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది అంతర్జాతీయంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి.
జీ20 కూటమి నేపథ్యం
అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం 1999లో జీ20 కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రపంచ ఆర్థిక సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను చూపడం ఈ కూటమి బాధ్యత. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది. 1999లో ఆగ్నేయాసియా ఆర్థిక వ్యవస్థల్లో నేలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌లతో కలిపి జీ20 కూటమిని ఏర్పాటు చేశారు. 2007లో ఈ కూటమిలో దేశాధినేతలు, ప్రభుత్వాలను కూడా చేర్చుతూ అప్‌గ్రేడ్ చేసారు.
జీ20 సదస్సులో భారత్ ఎజెండా ఇదే..
జీ20 కూటమి పట్ల ప్రపంచ సమస్యలను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పు, ఉగ్రవాదం, మహమ్మారి సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడం వల్లే పరిష్కరించుకోవచ్చని, ఒకదేశంతో మరొకదేశం పోరాడటం వల్ల అది జరగదన్నారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు మానవతా సంక్షోభాలకు దారితీయకుండా ఉండటానికి, ఆహారం, ఎరువులు, వైద్య ఉత్పత్తుల సరఫరాను రాజకీయరహితం చేయాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు.
భారత్ 'రూల్-టేకర్' నుంచి 'రూల్ మేకర్'గా మారడానికి మంచి తరుణం
2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు జీ20 సదస్సును దిల్లీలో నిర్వహించడం వల్ల ప్రపంచ నాయకుడిగా మోదీ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లతో సహా జీ20 దేశాధినేతలతో మోదీ చాలా సాన్నిహిత్యంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక దేశం విషయానికి వస్తే.. భారతదేశం 'రూల్-టేకర్' నుంచి 'రూల్ మేకర్'గా మారడానికి ఇదే మంచి తరుణం అనుకోవచ్చు. ప్రపంచ వ్యవహారాల్లో తన పాత్రను ప్రదర్శించడానికి భారతదేశానికి జీ20 శిఖరాగ్ర సమావేశం ఒక అవకాశం అనే చెప్పాలి. ఇప్పటికే చంద్రయాన్-3 విజయవంతం ద్వారా ప్రపంచ దృష్టిని భారత్ ఆకర్షించగలిగింది. త్వరలో నిర్వహించనున్న జీ20 సదస్సు ప్రపంచ యవనికపై భారత్ శక్తిగా ఎదగడానికి దోహదపడొచ్చు.
వచ్చే ఏడాది జీ20 ప్రెసిడెన్సీ బాధ్యతలు బ్రెజిల్‌కు..
జీ20 కూటమికి శాశ్వత అధ్యక్షుడు లేరు. ప్రతి సంవత్సరం, రొటేషన్ విధానం ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కరోనా మహమ్మారి తర్వాత నెలకొన్న భౌగోళిక రాజకీయ గందరగోళం, ఆర్థిక అనిశ్చితి సమయంలో ఇండోనేషియా నుంచి 2022 డిసెంబర్ 1న భారత్ జీ20 దేశాల కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. వచ్చే ఏడాది బ్రెజిల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుంది. 2025లో 2025లో దక్షిణాఫ్రికా జీ20 ప్రెసిడెన్సీగా ఉండనుంది. అయితే మూడు అభివృద్ధి చెందుతున్న దేశాలు వరుసగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జీ20 ఆర్థిక మంత్రుల తొలి సమావేశం జరిగింది. దేశాధినేతలతో మొదటి జీ20 సమ్మిట్ 2008లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు.