MPOX Alert: మంకీపాక్స్‌పై భారత్ అప్రమత్తం.. అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుజాగ్రత్త.. రాష్ట్రాలకు కూడా సూచనలు
ప్రపంచాన్ని మరోసారి అంటువ్యాధి ముప్పు పొంచి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాంగో,ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు. ఇదిలా ఉండగా, స్వీడన్‌కు చెందిన ఓ యాత్రికుడిలో ఈ వ్యాధి మొదటి కేసు కూడా కనుగొన్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి ఆఫ్రికాలో మాత్రమే కనిపించింది. మంకీపాక్స్ కేసులు ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. మరోవైపు భారత్‌లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం నిఘా పెంచింది.
రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కీలక సమావేశం నిర్వహించారు. మంకీపాక్స్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని విమానాశ్రయాలతో పాటు ల్యాండ్ పోర్ట్‌ల అధికారులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. మంకీ పాక్స్ వ్యాధిని ఎదుర్కోవడానికి ఢిల్లీలోని మూడు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులను నోడల్ కేంద్రాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ గుర్తించింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్,సఫ్దర్‌జంగ్ హాస్పిటల్,లేడీ హార్డింగ్ హాస్పిటల్ లలో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, చికిత్సకు ఏర్పాట్లు చేయనున్నది. నోడల్ కేంద్రాలు గుర్తించి మంకీ పాక్స్ వైరస్ ను గుర్తించడానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.