Loading...
India-Japan Defence Partnership: భారత్‌లో జపాన్ క్షిపణి పరీక్షలు.. రక్షణ రంగంలో కొత్త భాగస్వామ్యం
భారత్‌లో జపాన్ క్షిపణి పరీక్షలు.. రక్షణ రంగంలో కొత్త భాగస్వామ్యం

India-Japan Defence Partnership: భారత్‌లో జపాన్ క్షిపణి పరీక్షలు.. రక్షణ రంగంలో కొత్త భాగస్వామ్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-జపాన్ రక్షణ సంబంధాల్లో కీలక ముందడుగు పడుతోంది. ఇప్పటివరకు తన అత్యంత కీలకమైన క్షిపణి పరీక్షా కేంద్రాలను విదేశాలకు అందుబాటులోకి తీసుకురాని భారత్.. తొలిసారిగా జపాన్‌కు ఆ అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO)కు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)ను జపాన్ తన క్షిపణి కార్యక్రమాల కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. చాందీపూర్‌తో పాటు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక పరీక్షా కేంద్రాలను కూడా జపాన్‌కు అందుబాటులోకి తీసుకురావడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వివరాలు 

క్షిపణి సాంకేతికత, యుద్ధ నౌకల నిర్మాణంలోనూ సహకారం

ఈ సహకారం కేవలం క్షిపణుల పరీక్షలకే పరిమితం కానుంది.

అధునాతన క్షిపణి సాంకేతికత, ముఖ్యంగా హైపర్‌సోనిక్ ఆయుధాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపైనా ఇరు దేశాలు చర్చిస్తున్నాయి.

యుద్ధ నౌకల నిర్మాణంలోనూ కలిసి పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.

భారత్‌లో మొగామి తరహా బహుళ ప్రయోజనాల స్టెల్త్ ఫ్రిగేట్లను నిర్మించాలనే ప్రతిపాదన ఉందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.

అయితే, యుద్ధ నౌకల రూపకల్పన, నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్ వివరాలను పరస్పరం పంచుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించాయి.

వివరాలు 

భారత్‌లో యుద్ధ నౌకల పరికరాల తయారీకి జపాన్ ఆసక్తి

ఈ సహకారం కోసం భారత్ తన షిప్‌యార్డులు, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలను జపాన్‌కు అందుబాటులో ఉంచేందుకు ముందుకొచ్చింది.

జపాన్ అవసరాల కోసం భారత్‌లోనే యుద్ధ నౌకలకు సంబంధించిన పరికరాలను తయారు చేయడం, ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు.

జపాన్‌తో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయం తక్కువగా ఉండటం ఈ ప్రతిపాదనకు ప్రధాన కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భారత నౌకాదళ అవసరాల కోసం యూనికార్న్ (యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నా) తయారు చేయడంతో పాటు, జపాన్ సొంత అవసరాలకు, ఎగుమతులకు కూడా వీటిని భారత్‌లోనే ఉత్పత్తి చేసే అంశం చర్చల్లో ఉందని పేర్కొన్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌లో యుద్ధ నౌకల పరికరాల తయారీకి జపాన్ ఆసక్తి

గత వారం జరిగిన భారత్-జపాన్ 2+2 చర్చల్లో ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు.

సమావేశం అనంతరం భారత్‌లోని ఫైరింగ్ రేంజ్‌లను ఉపయోగించుకునే అంశంపై ఇరు దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకాలు చేశాయి.

ADVERTISEMENT

వివరాలు 

జపాన్‌కు భారత క్షిపణి పరీక్షా కేంద్రాలు ఎందుకు అవసరం?

ఈ ఒప్పందం అమల్లోకి వస్తే జపాన్ స్వీయ రక్షణ దళాలు తొలిసారిగా భారత్‌లో ప్రత్యక్ష క్షిపణి పరీక్షలు, ఫైరింగ్ శిక్షణ నిర్వహించగలుగుతాయి.

సముద్రంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే టైప్-25 వంటి నౌకా విధ్వంసక క్షిపణుల పరీక్షలకు కూడా అవకాశం ఉంటుంది.

ఈ క్షిపణి పరిధి సుమారు 1,000 కిలోమీటర్లుగా చెబుతున్నారు. ఈ ఏర్పాటును వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి ఇరు దేశాల రక్షణ విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నాయి.

పరీక్షా కేంద్రాల వినియోగం కోసం జపాన్ ఆస్ట్రేలియాతో కూడా చర్చలు జరుపుతోంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ తన సైనిక విధానంలో అతిపెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది.

వివరాలు 

జపాన్ సైనిక వ్యూహంలో మార్పులు..

గతంలో రాజ్యాంగ పరిమితుల కారణంగా పూర్తిగా రక్షణాత్మక పాత్రకే పరిమితమైన జపాన్ సైన్యం.. ఇప్పుడు సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి సామర్థ్యాలను పెంచుకుంటోంది.

అదే సమయంలో రక్షణ రంగ పరిశ్రమను విస్తరిస్తూ ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోంది.

గత అక్టోబర్‌లో జపాన్ సైనిక బృందం భారత్‌లో పర్యటించింది.

వివిధ క్షిపణి పరీక్షా కేంద్రాలను పరిశీలించింది. సుమారు వారం రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. క్షిపణి పరీక్షలతో పాటు చిన్నపాటి దాడి డ్రోన్లను పరీక్షించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించింది.

జపాన్‌లో భౌగోళిక పరిస్థితుల కారణంగా సుదూర క్షిపణి ప్రయోగాలకు అవసరమైన విశాలమైన, సురక్షితమైన సముద్ర ప్రాంతాలను గుర్తించడం కష్టంగా మారింది.

వివరాలు 

అధునాతన ఆయుధాల తయారీలోనూ భారత్‌తో జపాన్ భాగస్వామ్యం

ఈ నేపథ్యంలో తూర్పు తీర ప్రాంతంలో ఇప్పటికే ఉన్న క్షిపణి పరీక్షా సదుపాయాలు, బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు జపాన్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

ఇరు దేశాల చర్చలు పరీక్షా కేంద్రాల వినియోగానికే పరిమితం కావడం లేదు.

అధునాతన ఆయుధాల తయారీ, ముఖ్యంగా హైపర్‌సోనిక్ సాంకేతికతలో పరస్పర సహకారానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి.

గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భంలో పనిచేసే తక్కువ ఖర్చుతో కూడిన మానవరహిత వాహనాలను పెద్ద సంఖ్యలో ఉపయోగించే బహుళస్థాయి తీరప్రాంత రక్షణ వ్యవస్థను జపాన్ అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

నిఘా, దాడుల కోసం వీటిని వినియోగించనుంది. శత్రు దేశాల క్షిపణి పరిధికి అందకుండా దూరం నుంచే లక్ష్యాలను ఛేదించే స్టాండ్‌ఆఫ్ క్షిపణులకు ఇవి అదనపు బలంగా నిలవనున్నాయి.

వివరాలు 

చాందీపూర్ పరీక్షా కేంద్రం ప్రత్యేకత ఏమిటి?

చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతుండటం, ఉత్తర కొరియా మరింత అధునాతన క్షిపణులను అభివృద్ధి చేస్తుండటంతో జపాన్ తన రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోంది.

ఇందుకోసం కొత్త తరం క్షిపణులను అభివృద్ధి చేస్తోంది.

ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) భారత్‌లో అత్యంత కీలకమైన రక్షణ పరీక్షా కేంద్రాల్లో ఒకటి.

దేశ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో దీనిది ముఖ్యమైన పాత్ర. క్షిపణులను ప్రయోగించడం, వాటి ప్రయాణాన్ని పర్యవేక్షించడం, పనితీరును అంచనా వేయడం వంటి పరీక్షలకు అవసరమైన ఆధునిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

వివరాలు 

చాందీపూర్ పరీక్షా కేంద్రం ప్రత్యేకత ఏమిటి?

అత్యాధునిక రాడార్లు,టెలిమెట్రీ వ్యవస్థలు,ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ పరికరాలు,మిషన్ కంట్రోల్ సదుపాయాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.

వీటి ద్వారా క్షిపణి ప్రయాణించే మార్గాన్ని, వేగాన్ని, పనితీరును DRDO శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశీలించగలుగుతారు.

భారత వైమానిక రక్షణ వ్యవస్థలు,బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థల్లో ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల పరీక్షల్లోనూ ఈ కేంద్రం కీలకంగా వ్యవహరించింది.

ఇలాంటి అత్యంత కీలకమైన రక్షణ మౌలిక సదుపాయాలను జపాన్‌కు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత్-జపాన్ సంబంధాలు మరో స్థాయికి చేరనున్నాయి.

ఇప్పటివరకు సంయుక్త సైనిక విన్యాసాలు, సాధారణ రక్షణ సాంకేతిక సహకారానికే పరిమితమైన ఇరు దేశాల భాగస్వామ్యం.. ఇకపై అధునాతన ఆయుధాల అభివృద్ధి, క్షిపణి పరీక్షలు, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ వరకు విస్తరించనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT