Page Loader
Indian Navy: 26 రాఫెల్ మెరైన్ జెట్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది: దినేష్ కె త్రిపాఠి
రాఫెల్ మెరైన్ జెట్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది: దినేష్ కె త్రిపాఠి

Indian Navy: 26 రాఫెల్ మెరైన్ జెట్‌ల కోసం ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది: దినేష్ కె త్రిపాఠి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2024
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత నౌకాదళం (Indian Navy) కోసం అవసరమైన మూడు అదనపు స్కార్పియన్‌ శ్రేణి జలాంతర్గాములు, 26 రఫేల్‌ ఎం విమానాల కొనుగోలు కాంట్రాక్టులపై వచ్చే నెలలో సంతకాలు జరగనున్నట్లు నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్‌ దినేశ్‌ కె త్రిపాఠి తెలిపారు. డిసెంబర్‌ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, ఒడిశాలోని పూరి ప్రాంతంలో జరుగనున్న ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు అని ఆయన తెలిపారు. ప్రస్తుతం నౌకాదళానికి చెందిన 63 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి నిర్మాణంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

ఎస్‌ఎస్‌ఎన్‌ జలాంతర్గాముల్లో మొదటి జలాంతర్గామి

దేశీయంగా డిజైన్‌ చేసిన రెండు ఎస్‌ఎస్‌ఎన్‌ (అణు శక్తితో పనిచేసే అటాక్‌ సబ్‌మెరైన్‌లు) శ్రేణి జలాంతర్గాముల ప్రాజెక్టు కూడా భారత్‌లో నౌకా నిర్మాణ పరిశ్రమకు పునరుజ్జీవనాన్ని తెచ్చిపెడుతుంది. ఈ ఎస్‌ఎస్‌ఎన్‌ జలాంతర్గాముల్లో మొదటి జలాంతర్గామి 2036-37 నాటికి కార్యకలాపాలకు సిద్ధమవుతుందని, ఆ తరువాత మరో రెండు సంవత్సరాల్లో మిగిలిన వాటి కూడా సిద్ధమవుతాయని చెప్పారు. తాజాగా, ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ అణు జలాంతర్గామి నుండి బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని సాఫీగా నిర్వహించినట్లు డీకే త్రిపాఠి తెలిపారు. ఆ ప్రయోగానికి వార్‌ హెడ్‌ లేనట్లు, ప్రయోగం విజయవంతమైందని, క్షిపణి ప్రయాణ మార్గాన్ని నిపుణులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

వివరాలు 

పాకిస్థాన్‌ వద్ద 50 యుద్ధ నౌకలు

అలాగే, నౌకాదళం ఇప్పటివరకు ఉన్న చేతక్‌ హెలికాప్టర్ల పాతవి కావడంతో, వాటిని భర్తీ చేయడానికి 60 యూహెచ్‌ మారిటైమ్‌ హెలికాప్టర్ల కోసం ప్రతిపాదనలు చేయడం జరుగుతున్నట్లు వివరించారు. పాకిస్థాన్‌ తన ప్రజావసరాలను పక్కన పెట్టి, ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, భారీగా ఆయుధాలను సేకరిస్తున్నట్లు నావికాదళ ప్రధాన అధికారి తెలిపారు. వచ్చే 10 సంవత్సరాల్లో పాకిస్థాన్‌ వద్ద 50 యుద్ధ నౌకలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ చైనా సముద్రంలో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది అని ఆయన అన్నారు.

వివరాలు 

మిగ్‌-29కే, హాక్‌ ఫైటర్ల విన్యాసాలు 

1971 భారత్-పాకిస్థాన్‌ యుద్ధంలో నావికాదళం ప్రదర్శించిన వీరత్వానికి గుర్తుగా డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. ఈసారి ఒడిశాలోని పూరి సముద్రతీరంలో నౌకాదళం తన శక్తిని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో 15 నౌకలు, జలాంతర్గాములు, 40 విమానాలు, మార్కోస్‌ కమాండోలు, ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది పాల్గొననున్నారు. ముఖ్యంగా, మిగ్‌-29కే, హాక్‌ ఫైటర్లు తమ విన్యాసాలతో ఆకర్షణగా నిలుస్తాయి.