MEA on USA: మోదీ -ట్రంప్'తో ఎనిమిది సార్లు ఫోన్‌లో మాట్లాడారు: విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడమే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై భారత్ స్పష్టంగా స్పందించింది. ఇరుదేశాలకు సంబంధించిన పలు అంశాలపై గత ఏడాది ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మొత్తం ఎనిమిది సార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు భారత విదేశాంగశాఖ (MEA) వెల్లడించింది. అలాగే, రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అదనపు ఆంక్షలు విధించేందుకు తీసుకొస్తున్న బిల్లుపై కూడా పూర్తి అవగాహన ఉందని, ప్రస్తుత పరిణామాలను గమనిస్తున్నామని తెలిపింది.
వివరాలు
కట్టుబడి ఉన్నాం..
అమెరికా వాణిజ్య మంత్రి చేసిన వ్యాఖ్యలను గమనించాం. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపాలన్న నిర్ణయానికి గతేడాది ఫిబ్రవరి 13 నాటికే ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయి. ఆ తర్వాత నుంచి పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇరుపక్షాలు పలుమార్లు సంప్రదింపులు జరిపాయని తెలిపింది. అయితే ఈ అంశంపై అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత లేదని పేర్కొంది. పలు సందర్భాల్లో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చామని, ఇప్పటికీ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించింది. గత ఏడాది ఎనిమిది సార్లు ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
వివరాలు
మైనార్టీల్లో మరింత భయం..
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై, వారి నివాసాలు మరియు వ్యాపారాలపై జరుగుతున్న వరుస దాడుల అంశాన్ని భారత్ మరోసారి ప్రస్తావించింది. ఈ సమస్యను గతంలోనే దృష్టికి తీసుకొచ్చామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇలాంటి ఘటనలను వ్యక్తిగత లేదా రాజకీయ వివాదాలుగా కొట్టిపారేయడం వల్ల నేరాలకు పాల్పడేవారు మరింత ధైర్యం పొందే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీంతో మైనార్టీల్లో భయం, అభద్రతా భావం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
ఇంధన భద్రతే ముఖ్యం..
అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టనున్న 500 శాతం సుంకాల విధింపు బిల్లుపై అవగాహన ఉందని భారత్ తెలిపింది. ఈ విషయమై జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించింది. చమురు విషయంలో తమ వైఖరి ఇప్పటికే స్పష్టమేనని పేర్కొన్న విదేశాంగ శాఖ, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను అనుసరించి నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించింది. భారత ప్రజల ఇంధన భద్రతను కాపాడటం తమ ప్రధాన బాధ్యత అని మరోసారి స్పష్టం చేసింది.