దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 25న కేరళలోని కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ఈ ప్రాంతంలో ఆర్థిక, పర్యాటకాభివృద్ధి కోసం ఇది ఎంతో దోహదం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జాతికి అంకితం చేయనున్న ఈ వాటర్ మెట్రోకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.
వాటర్ మెట్రో అనేది సాధారణ మెట్రో వ్యవస్థలాగే ఉంటుంది. ఇది పట్టణ రవాణా కోసం వినియోగించే వ్యవస్థ మాదిరిగా ఉంటుందని, కొచ్చి వంటి నగరాల్లో మెట్రో ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
కొచ్చిలో రూ.1,136.83 కోట్లతో ఏర్పాటు చేసిన మెట్రో చుట్టుపక్కల ఉన్న 10 దీవులను కలుపుతుంది. కొచ్చి అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ దోహపడుతుందని కేరళ సీఎం విజయన్ వ్యాఖ్యానించారు.
వాటర్ మెట్రో
78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్‌తో వాటర్ మెట్రో నిర్మాణం
వాటర్ మెట్రో అనేది కేరళ కలల ప్రాజెక్టు. దీనిలో భాగంగా 78 ఎలక్ట్రిక్ బోట్లు, 38 టెర్మినల్స్‌తో వాటర్ మెట్రోను నిర్మించారు.
కేరళ ప్రభుత్వం, జర్మన్ ఫండింగ్ ఏజెన్సీ కేఎఫ్‌డబ్ల్యూ ఆధ్వర్యంలో మెట్రో నిర్మాణం జరిగినట్లు ముఖ్యమంత్రి విజయన్ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్ మొదటి దశలోనే హైకోర్టు-వైపిన్, వైట్టిల-కక్కనాడ్ టెర్మినల్స్ సేవలు ప్రారంభమవుతాయి. ఎయిర్ కండిషన్డ్ బోట్ల మెట్రోలో ప్రయాణం చాలా సురక్షితమని, తక్కువ ఖర్చుతో కూడుకున్నదని విజయన్ ఈ మేరకు ట్వీట్ చేశారు.
ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందని ముఖ్యమంత్రి విజయన్ ఆశాభావం వ్యక్తం చేశారు.