దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం
హైదరాబాద్ దేశానికే హెల్త్ సిటీగా మారనుందా. ఈ విషయానికి అవుననే సమాధానాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా దేశంలోనే అతిపెద్ద సర్కార్ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముహుర్తం వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత నగరం, హైదరాబాద్ చరిత్రలోకి ఎక్కనుంది. నిమ్స్‌కు అనుబంధంగా పక్కనే మరో అధునాతనమైన కార్పోరేట్ తరహా హాస్పిటల్ ను కట్టాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీలోని ఎర్రమంజిల్ వద్ద సుమారు 25 లక్షల చ.అ విస్తీర్ణంలో నిర్మించేందుకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి.
ఈ నెల 14న నూతన ఆస్పత్రి క్యాంపస్ కి సీఎం కేసీఆర్ భూమిపూజ
ఆస్పత్రికి స్థలం కొరత ఉన్న నేపథ్యంలో నిమ్స్‌కు సమీపంలోనే ఉన్న పాత ప్రభుత్వ క్వార్టర్లను (ఆర్ అండ్ బీ) రోడ్లు భవనాల శాఖ తొలగించింది. దాని స్థానంలోనే ఆస్పత్రి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించింది. అయితే టెండర్లను సైతం ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మరోవైపు ఈ నెల 14న నూతన ఆస్పత్రి క్యాంపస్ కి సీఎం కేసీఆర్ భూమిపూజ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2,100 బెడ్లతో 32 డిపార్ట్‌మెంట్లు కొత్త క్యాంపస్ లో దాదాపు 34 స్పెషలైజేషన్ డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేసే రీతిలో బిల్డింగ్ ను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. సకల హంగులతో, అత్యాధునికంగా నిర్మించాలని ఆయా శాఖలకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
1300 పడకల నుంచి 2100కు పెంపు
ప్రస్తుతం 1300 బెడ్లు ఇప్పుడున్న నిమ్స్ 22 ఎకరాల్లో దాదాపు 1,300 పడకలతో నిర్వహిస్తున్నారు. తాజాగా రూ. 1,570 కోట్ల భారీ అంచనాలతో కొత్త ఆస్పత్రిని ఏకంగా 2,100 పడకలుగా నిర్మించనున్నారు. ఇది భారత్ లోనే అతిపెద్ద ఆస్పత్రి బిల్డింగ్ గా రికార్డులకెక్కనుంది. టిమ్స్ కోసం ప్రభుత్వం 32 ఎకరాలను అలాట్ చేసింది. అయితే నిర్మాణానికి కేవలం 26 ఎకరాలు మాత్రమే అనువుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 3 ఏళ్లలో నిర్మాణం ఈ క్యాంపస్ ను 36 నెలల కాలవ్యవధిలోనే అందుబాటులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్, హైదరాబాద్ పరిధిలోని సనత్‌నగర్, ఎల్బీనగర్ ఏరియాల్లోనూ 3 భారీ ఆస్పత్రులను నిర్మించేందురు సర్కార్ చర్యలను వేగవంతం చేస్తోంది.