
F-16 Shot Down: పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు గురువారం రాత్రి తీవ్రంగా పెరిగిపోయాయి.
పాకిస్థాన్ ఆ రాత్రి జమ్మూ, జైసల్మేర్, పఠాన్‌కోట్ సహా అనేక ప్రాంతాలపై క్షిపణుల దాడులకు పాల్పడింది.
అయితే, భారత వాయు రక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉండటంతో, అత్యాధునిక S-400 వాయు రక్షణ వ్యవస్థల సహాయంతో ఆ క్షిపణులను గాల్లోనే కూల్చివేయడం ద్వారా ఆ దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.
అంతేకాకుండా, దాడిలో పాల్గొన్న పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను భారత్ విజయవంతంగా కూల్చివేసింది.
పాక్ దాడి పరిధిలో జమ్మూ,పఠాన్‌కోట్,షాపూర్,మాధోపూర్, ఫిరోజ్‌పూర్, జైసల్మేర్ వంటి ప్రాంతాలపై క్షిపణులు,డ్రోన్లను ప్రయోగించారు.
దాడి ప్రారంభమైన వెంటనే జమ్మూ సహా ఇతర ప్రాంతాల్లో సైరన్లు మోగాయి, దీనితో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి.
వివరాలు
జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్లను కూల్చివేత
భద్రతా కారణాల వల్ల ఆ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.
దాడి అనంతరం, భారత వాయుసేన యుద్ధ విమానాలు జమ్మూ విమానాశ్రయం నుంచి వెంటనే ఎగిరాయి.
జమ్మూ విశ్వవిద్యాలయం సమీపంలో రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం.
అలాగే, ఆర్ఎస్ పురా, అర్నియా, సాంబా ప్రాంతాల్లో పాక్ ప్రయోగించిన క్షిపణులను యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు సమర్థవంతంగా అంతరాయం కలిగించాయి.
పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని కూడా భారత వాయుసేన తిప్పికొట్టగలిగింది. ఈ ప్రాంతంలో కూడా విద్యుత్ నిలిపివేయబడింది.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్
పేలుళ్ల శబ్దాలు వినిపించిన వెంటనే దుకాణదారులు,స్థానికులు భయంతో పరుగులు తీసి తమ ఇళ్లకు వెళ్లిపోయారు.
పేలుళ్లకు కొద్దిసేపటి ముందు ఆకాశంలో ఎరుపు కాంతులు, ప్రకాశాన్ని చూసినట్లు కొందరు తెలిపారు.
ఇదంతా జరుగుతున్నపుడే, ఒక ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ - "ఇది పుకారు కాదు. నా కళ్లతోనే చూస్తున్నాను. మా ఇంటిపై క్షిపణులు ఎగురుతున్నాయి. రికార్డ్ చేస్తున్నాను" అని పేర్కొన్నారు.
దీంతో ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేయడానికి భారత్ తన అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థను వినియోగించింది.
ఇది సమగ్రంగా ప్రతిదాడిని అడ్డుకునేందుకు భారత్ తీసుకున్న తక్షణ చర్యల్లో ఒకటి.