
X Handle: పహల్గాం దాడి తర్వాత భారత్ కఠిన నిర్ణయం.. ఇమ్రాన్ ఖాన్, భుట్టో 'ఎక్స్' ఖాతాలు బ్లాక్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్ కీలక నేతల సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయడం కీలక ఘట్టంగా మారింది.
ఈ క్రమంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో ఎక్స్ (X) ఖాతాలను భారత్ నిలిపివేసింది.
అంతేకాదు, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారిక ఖాతాను కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి కారణంగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌పై తప్పుడు ప్రచారం చేయడమేనని కేంద్రం పేర్కొంది.
అంతకుముందు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ ఎక్స్ ఖాతాను కూడా భారత్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
Details
16 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం
అదేవిధంగా పాక్ ఆధారిత 16 యూట్యూబ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లను కూడా నిషేధించింది.
ఇటీవల మీడియాతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని విషాదకరమైనదిగా పేర్కొంటూ, భారత్ కశ్మీర్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే భారత్ పాక్‌పై దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందిస్తామంటూ హెచ్చరించారు.
ఇక బిలావల్ భుట్టో మరింత కఠినంగా స్పందిస్తూ, సింధు నదిపై వ్యాఖ్యలు చేశారు. 'నీరు పారకపోతే.. రక్తం పారుతుంది' అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Details
ఉగ్రదాడిలో 26 మంది మృతి
సింధు నది పాక్‌దేనని, ఆ నాగరికతకు రక్షకులు తామేనంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై వివిధ రంగాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇప్పటికే పాక్ జాతీయులను దేశం నుంచి వెనక్కి పంపించడమే కాక, దౌత్యపరంగా, మాధ్యమాల స్థాయిలో కీలక చర్యలు తీసుకుంటోంది.