PM Modi:మే నెలలో సింహాల గణన.. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (NBWL) సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈసందర్భంగా ఆసియాటిక్ సింహాల జనాభా అంచనాను ఈ ఏడాది మే నెలలో నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
సోమవారం ఉదయం జునాగఢ్ జిల్లాలోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోడీ,లయన్ సఫారీ చేశారు.
ఆయన వెంట కేంద్ర పర్యావరణ,అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్,ఇతర అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
జునాగఢ్‌లో నేషనల్ రెఫరల్ సెంటర్-వైల్డ్‌లైఫ్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ, రివర్ డాల్ఫిన్‌లపై ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అదే విధంగా,తమిళనాడులోని కోయంబత్తూరులో మానవ-వన్యప్రాణుల మధ్య జరుగుతున్న సంఘర్షణను నివారించేందుకు ప్రత్యేకంగా ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
వివరాలు
ఆసియాటిక్ సింహాల సంరక్షణ.. రూ.2,900 కోట్లకు పైగా నిధులు
భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిదని, జీవ వైవిధ్యాన్ని సంరక్షించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లో మూడు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
సమిష్టి కృషి వల్ల ఆసియాటిక్ సింహాల జనాభా స్థిరంగా పెరుగుతోందని, వాటి నివాసాలను కాపాడేందుకు స్థానిక గిరిజనుల సహకారం ఎంతో కీలకమని ఆయన ప్రశంసించారు.
గుజరాత్‌లో మాత్రమే కనిపించే ఆసియాటిక్ సింహాల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లకు పైగా నిధులు కేటాయించింది.
ప్రస్తుతం, ఈ సింహాలు గుజరాత్‌లోని 9 జిల్లాల్లో, 53 తాలూకాలలో, దాదాపు 30,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జీవిస్తున్నాయి.