భారత్ భళా..2030 నాటికి ఉపాధి రంగంలో మరో ఘనత : మెకిన్సే నివేదిక
ప్రపంచ దేశాల్లో భారత్ మరో ఘనత సాధించనుంది. ఈ మేరకు 2030 నాటికి జనాభాలో పని చేసే వయసులో ఉన్నవారు అత్యధికంగా ఉండే తొలి మూడు దేశాల్లో ఒకటిగా భారతదేశం నిలవనుంది. ఈ వయసు వారు ఎక్కువగా ఉండే ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో భారత్, చైనా, ఇండోనేషియాలు ఉండనున్నట్లు మెకిన్సే నివేదిక ప్రకటించింది. అయితే ఈ మూడు దేశాలు G-20లోనూ ఉండటం విశేషం. దీన్ని బట్టి ఎకనామిక్ జాగ్రఫీ తూర్పు దేశాల వైపు పయనిస్తోందని తెలుస్తోంది. డ్రైవింగ్ సుస్టెయినబుల్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్ ఇన్ G-20 ఎకానమీస్ నివేదికలో మెకిన్సే వెల్లడించింది.
ఇండియాలో 1.07 బిలియన్ల మంది ఆర్థిక సాధికారత రేఖకు దిగువన ఉన్నారు
డిజిటల్, డేటా ప్రసారం వల్ల సమాచారం, విజ్ఞానం పరస్పరం మార్పిడి జరుగుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఫలితంగా అంతకుముందు కన్నా మరింత ఎక్కువగా ఒకరిపై మరొకరు పరస్పరం ఆధారపడే రీతిలో రూపొందుతున్నట్లు మెకిన్సే వివరించింది. ఎకనమిక్ జాగ్రఫీ తూర్పునకు మరలుతుందని, భవిష్యత్ లో ఆర్థిక కేంద్రాలు కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం G-20 దేశాల్లో సుస్థిరత, సమ్మిళిత్వం రెండూ విస్తృతమైనవని, అలాగే విభిన్నమైనవనే అంచనా వేసినట్లు నివేదిక చెప్పింది. G-20 దేశాల్లో ఆర్థిక సాధికారత రేఖకు దిగువన 2.6 బిలియన్ల మంది ఉన్నారని వెల్లడించింది. మొత్తం ప్రపంచంలోనే 4.7 బిలియన్ల మంది ఉండగా, ఇండియాలో 1.07 బిలియన్ల మంది దిగువన ఉన్నట్లు స్పష్టం చేసింది.