Page Loader
India-US Mini Trade Deal: రెండు రోజుల్లో భారత్,అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం  
రెండు రోజుల్లో భారత్,అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం

India-US Mini Trade Deal: రెండు రోజుల్లో భారత్,అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, రెండు దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం (మినీ ట్రేడ్ డీల్) కుదరే అవకాశం ఉంది. ఇది వచ్చే 48 గంటల్లో ఖరారవవచ్చని, ప్రస్తుతం వాషింగ్టన్‌లో కీలక చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనిపై జాతీయ మీడియాలో నివేదికలు ప్రచురితమయ్యాయి. ఈ వాణిజ్య ఒప్పందంలో ప్రధానంగా వ్యవసాయం, ఆటోమొబైల్, పరిశ్రమల ఉత్పత్తులు, కార్మికులపై ఆధారపడిన వస్తువులపై దృష్టిసారించబడింది. వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ అంశాల్లో మాత్రం ఇరువైపులకూ కొంత విభేదం నెలకొంది. భారతదేశం తన పాల ఉత్పత్తుల మార్కెట్‌ను విదేశీ కంపెనీలకు తెరవడానికి ఆసక్తి చూపడం లేదు.

వివరాలు 

ప్రస్తుతం బేస్‌లైన్‌ టారిఫ్‌ 10 శాతం

అదే సమయంలో, అమెరికా మాత్రం కొన్ని రకాల పరిశ్రమల ఉత్పత్తులకు, ఆటోమొబైల్ విభాగానికి బహుళ రాయితీలను కోరుతోంది. విద్యుత్తు వాహనాలు, వైన్లు,పెట్రోకెమికల్స్, డెయిరీ ఉత్పత్తులు, యాపిల్స్, నట్స్, జన్యుపరంగా మారిన పంటల విషయంలో అమెరికా లబ్ధి పొందాలనే దృక్పథంతో ఉంది. మరోవైపు, అమెరికా గతంలో భారత్‌ దిగుమతులపై విధించిన 26శాతం దిగుమతి సుంకాలు జూలై 9 వరకు మాత్రమే అమల్లో ఉండనున్నాయి. ప్రస్తుతం బేస్‌లైన్‌ టారిఫ్‌ 10 శాతం వర్తిస్తోంది. భారత్‌ ఈ చర్చల సందర్భంలో 26శాతం సుంకంపై రాయితీ కోసం ఒత్తిడి తీసుకొస్తోంది. ఇక మరో కీలక అంశం ఏమిటంటే.. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటన జూలై 8 వ తేదీకి ముందే వెలువడే అవకాశముందని గతంలో వార్తలు వచ్చాయి.

వివరాలు 

గడువును మరింత పొడిగించే ఆలోచన లేదు 

ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్న వాణిజ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రస్తుతం వాషింగ్టన్‌లో ఉంటూ చివరి దశ చర్చలను నిర్వహిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధించిన దిగుమతి సుంకాలపై సస్పెన్షన్‌ ఈనెల 9వ తేదీ వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఈ గడువును మరింత పొడిగించే ఆలోచన తనకు లేదని అమెరికా అధ్యక్షుడు ఫాక్స్ న్యూస్‌కి స్పష్టం చేశారు. సుంకాల అమలు త్వరలోనే ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.