LOADING...
India-Us Trade Deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం.. చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు
చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు

India-Us Trade Deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం.. చౌకగా మారనున్న ల్యాప్‌టాప్‌లు,ఎలక్ట్రానిక్ వస్తువులు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చల అనంతరం ఈ డీల్‌కు తుది రూపు దిద్దుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపై విధించే దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ కూడా పలు అమెరికా ఉత్పత్తులపై సుంకాల్లో కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ పరిణామంతో దేశీయ మార్కెట్‌లో అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

భారత్ నుంచి వస్త్ర, ఆభరణాల రంగాలకు ప్రయోజనం

ఈ వాణిజ్య ఒప్పందం వల్ల ముఖ్యంగా టెక్నాలజీ హార్డ్‌వేర్ రంగానికి లాభం చేకూరనుంది. ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ వస్తువులు, గృహోపకరణాల దిగుమతి ఖర్చులు కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. మరోవైపు పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి వ్యవసాయ దిగుమతులపై సుంకాలు తగ్గితే, ఆహార ధరల పెరుగుదల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఒప్పందం భారత ఎగుమతి రంగాలకు కూడా బలాన్నిచ్చేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వస్త్రాలు, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు అమెరికా మార్కెట్‌లో మరింత అవకాశాలు ఏర్పడనున్నాయి.

వివరాలు 

అన్ని ఉత్పత్తులకు ఈ ఒప్పందం వర్తించదు 

అలాగే భారత్ నుంచి పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే రత్నాలు, ఆభరణాల రంగానికి ఈ డీల్ అనుకూలంగా మారనుంది. పారిశ్రామిక, ఇంజనీరింగ్ ఉత్పత్తులైన స్టీల్, రసాయనాలు తదితర వాటికి కూడా అమెరికా మార్కెట్‌లో ప్రవేశం సులభతరం కానుంది. అయితే అన్ని ఉత్పత్తులకు ఈ ఒప్పందం వర్తించదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్టీల్, అల్యూమినియం, రాగి వంటి కొన్ని వస్తువులపై సుమారు 50 శాతం వరకు సుంకాలు కొనసాగనున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ఆటోమొబైల్ విడిభాగాలపై ఉన్న అధిక సుంకాలు యథాతథంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించి, అమెరికా,వెనిజులా నుంచి దిగుమతులను పెంచుకునేందుకు భారత్ అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Advertisement

వివరాలు 

ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, షరతులపై అధికారిక ప్రకటన

ఈ డీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ఈ రోజు నా ప్రియ మిత్రుడు అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడటం సంతోషంగా ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు 18 శాతానికి తగ్గడం ఆనందాన్ని కలిగించింది. ఈ అద్భుత నిర్ణయానికి 140 కోట్ల మంది భారతీయుల తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, షరతులపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Advertisement