LOADING...
USA-India: వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగదు : యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌ కీలక వ్యాఖ్యలు
వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగదు : యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌ కీలక వ్యాఖ్యలు

USA-India: వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగదు : యూఎస్‌ రిటైర్డ్‌ కల్నల్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతకాలంగా ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈఅంశంపై అమెరికా రిటైర్డ్‌ కల్నల్‌, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్‌ మాక్‌గ్రెగర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో అమెరికా చెప్పిన ప్రతిదానికీ భారత్‌ తలొగ్గే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశమైనా తన స్వంత ప్రయోజనాలను పక్కన పెట్టి, ఇతర దేశాల ఒత్తిడికి లోబడి చర్చలు జరపదని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాక్‌గ్రెగర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో వ్యాపారం చేస్తుందన్న కారణంతో భారత్‌పై 50శాతం సుంకాలు విధించాలన్న ట్రంప్‌ వైఖరి ఆయన మూర్ఖపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని మాక్‌గ్రెగర్‌ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి చర్యల ద్వారా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని చూడటం సరికాదన్నారు.

Details

మాతో లేకపోతే శత్రువులే

భారత్‌-అమెరికా సంబంధాలపై మాట్లాడుతూ.. అమెరికా ఎప్పుడూ "మాతో ఉంటే మిత్రులు, లేకపోతే శత్రువులు" అనే దృక్కోణంతో వ్యవహరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్‌-రష్యాలు సన్నిహిత మిత్ర దేశాలుగా కొనసాగుతున్నాయని, ఇప్పుడు ఆ రెండు దేశాలు కలిసి వ్యాపారం చేయకూడదని చెప్పడం ద్వారా భారత్‌ను అమెరికా దూరం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మలేసియా వంటి దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తమ ప్రధాన విధానాలపైనా రాజీపడాల్సి వచ్చిందని మాక్‌గ్రెగర్‌ గుర్తు చేశారు. అలాగే గ్రీన్‌లాండ్‌తో వ్యాపారం చేస్తున్న యూరోపియన్‌ దేశాలపై కూడా ట్రంప్‌ సుంకాలు విధించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచ దేశాలను బెదిరిస్తూ, ఇష్టానుసారంగా టారిఫ్‌లు విధిస్తే చివరికి అమెరికాకే నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement