బియ్యం ధరల కట్టడికి కేంద్రం కళ్లెం.. ఎగుమతులపై నిషేధం విధింపు
బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశంలో ధరలను నియంత్రించేందుకు గురువారం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. సదరు బియ్యాన్ని నిషేధిత ఎగుమతుల జాబితాలోకి చేర్చామని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఫారిన్ ట్రేడ్ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌లో బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని కేంద్రం విధించింది. దేశ ప్రజల అవసరాలకు కావాల్సిన నిల్వలు సిద్ధం చేసుకునే దిశగా తాజాగా నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కురుస్తున్న కుంభవృష్టికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
అంతర్జాతీయ బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ అతిపెద్ద ఎగుమతిదారు
గత సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11 శాతం పెరిగాయి. అయితే 3 శాతం మేర గడిచిన ఒక్క నెలలోనే పెరగడం గమనార్హం. బియ్యం ఎగుమతుల్లో భారత్ బాస్మతీయేతర బియ్యం వాటా దాదాపు పాతిక శాతమని వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు బియ్యంపై ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగేందుకు ఆస్కారం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం అంతర్జాతీయ ఆహార ధరలపై ప్రభావం చూపిస్తుండటం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ లో భారత్ బియ్యం ఎగుమతుల వాటా 40 శాతంగా ఉంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ అతిపెద్ద దేశంగా నిలిచింది.