G-20 సమావేశానికి భారత్ భారీ వ్యయం.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
భారత్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G-20 సదస్సుకు కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ వ్యాప్తి అనంతరం ప్రపంచ దేశాలు ఖర్చులపై నియంత్రణతో వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో G-20 సమావేశం కోసం భారత ప్రభుత్వం ఏకంగా రూ. 4,100 కోట్లు ఖర్చు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. G-20 ప్రెసిడెన్సీ కోసం 2023-24 బడ్జెట్‌లో భారత ప్రభుత్వం రూ. 990 కోట్లు కేటాయించింది. కానీ బడ్జెట్ కంటే 4 రెట్లు అధికంగా వెచ్చించడం విమర్శలకు తావిస్తోంది. దిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G-20 సదస్సు విజయవంతం కోసం అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గత కొంత కాలంగా ఎంతో శ్రమించి విస్తృత ఏర్పాట్లు చేశారు.
జీ-20 కోసం కనీవినీ ఎరుగని రీతిలో ఖర్చు పెట్టిన చైనా
G-20 సదస్సు నిర్వహణ కోసం వివిధ దేశాలు ఖర్చు వివరాలు : భారత్ 2023 - రూ.4,100 కోట్లు ఇండోనేషియా 2022 - రూ.364 కోట్లు జపాన్ (2019) రూ.2,660 కోట్లు, అర్జెంటీనా (2018) రూ. 931 కోట్లు, జర్మనీ (2017) రూ. 634 కోట్లు, చైనా (2016) రూ. 1.9 లక్షల కోట్లు, ఆస్ట్రేలియా (2014) రూ. 2653 కోట్లు, రష్యా (2013) రూ. 170 కోట్లు, ఫ్రాన్స్ (2011) రూ.712 కోట్లు, కెనడా (2010) రూ. 4351 కోట్లు వెచ్చించాయి. 2024 ఎన్నికలకు సంబంధించి జీ-20 ద్వారానే ప్రధాని మోదీ ప్రచారం చేసుకున్నట్లుగా టీఎంసీ అభివర్ణించింది. మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రం కొట్టిపారేసింది. అవసరానికి తగ్గట్లే తాము వ్యవహరించినట్లు స్పష్టం చేసింది.