LOADING...
IndiGo Crisis: సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు
సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు

IndiGo Crisis: సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై (IndiGo Crisis) ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది. వరుసగా విమానాలు రద్దవుతూ ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. వెంటనే విచారణ చేపట్టాలని, అలాగే పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Details

500పైగా ఇండిగో విమానాలు రద్దు

శనివారం ఒక్కరోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 500కి పైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితులపై దిల్లీ ఎయిర్‌పోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. సేవలు క్రమంగా పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, కొన్ని మార్గాల్లో ప్రభావం కొనసాగుతూనే ఉందని పేర్కొంది. ఇదే సమయంలో ప్రయాణికులకు సహాయం అందించాలని రైల్వే కూడా ముందుకొచ్చింది. 37 రైళ్లకు మొత్తం 116 అదనపు బోగీలను జోడించి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చే ప్రయత్నం ప్రారంభించింది.

Details

నిబంధలను కచ్చితంగా పాటించాలి

ఇక ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే అత్యవసరమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఇప్పటికే స్పష్టం చేశారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, షెడ్యూల్ ప్రణాళికలను సమగ్రంగా సమీక్షిస్తున్నామని తెలిపారు. అన్ని ఎయిర్‌లైన్స్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయో లేదో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సమస్య ఎక్కడ మొదలైందో, ఏ దశలో తప్పులు జరిగాయో వెలికితీయడానికి ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పిల్లలు, వృద్ధులు, పాలిచ్చే తల్లులు, వికలాంగులను ప్రయాణాల్లో ప్రాధాన్యంతో చూడాలని దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించినట్టు కూడా మంత్రి తెలిపారు.

Advertisement