
IndiGo: ప్రయాణీకురాలికి అపరిశుభ్రమైన సీటు..ఇండిగోకు రూ. 1.5 లక్షల జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ వినియోగదారుల ఫోరం ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటు (Unhygienic Seat) కేటాయించిన కారణంగా ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌పై రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సంబంధిత ప్రయాణికురాలికి పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 5న బాకు-న్యూఢిల్లి ఇండిగో విమానంలో ప్రయాణించిన పింకీ అనే మహిళ, తనకు కేటాయించిన సీటు శుభ్రంగా లేకపోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఫోరంకు ఫిర్యాదు చేశారు. ఆమె ఈ అసౌకర్యం, మానసిక వేదన కారణంగా పరిహారం కోరడమే కాకుండా, ఈ కేసు కోసం తాను ఖర్చు చేసిన రూ.25,000 కూడా తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
"సిట్యువేషన్ డేటా డిస్‌ప్లే" (SDD) నివేదిక సమర్పించడంలో ఇండిగో విఫలం
ఫిర్యాదు విచారణ అనంతరం కమిషన్, ప్రయాణికురాలు ఎదుర్కొన్న అసౌకర్యం, మానసిక ఇబ్బందులకు పరిహారం చెల్లించాల్సిందిగా ఇండిగోను ఆదేశించింది. అంతేకాక, ఆమె పేర్కొన్న రూ.25,000 ఖర్చును కూడా తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, ఈ ఆదేశాలను ఇండిగో వ్యతిరేకించింది. సీటు సమస్యపై ప్రయాణికురాలి అభ్యర్థన మేరకు తాము వెంటనే వేరే సీటు కేటాయించామని, ఆమె తరువాత సౌకర్యవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు సంస్థ పేర్కొంది. కానీ, ఈ అంశానికి సంబంధించిన వినియోగదారుల ప్రయాణ సమాచారంలో భాగమైన "సిట్యువేషన్ డేటా డిస్‌ప్లే" (SDD) నివేదికను సమర్పించడంలో ఇండిగో విఫలమైనందున, జరిమానా తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.