మరోసారి వివాదాస్పదమైన ఇండిగో.. ఏసీ లేకుండానే గాల్లోకి లేచిన విమానం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరో వివాదానికి కేంద్ర బిందుగా మారింది. చండీగఢ్ నుంచి జైపుర్‌కు శనివారం బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. 10-15 నిమిషాల పాటు తమను ఎండలోనే క్యూలో నిలబడేలా చేశారని, విమానంలోకి ప్రవేశించాక ఏసీలు పనిచేయలేదని పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా అసంతృప్తి వ్యక్తం చేశారు. విమానం టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు చెమటలు కక్కారు. వేడికి తట్టుకోలేక మరికొందరు కాగితాలతో విసురుకున్నారు. చెమటను తుడుచుకునేందుకు ఎయిర్ హోస్టెస్ టిష్యూలను అందించారని అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు డీజీసీఏకు, AAIకు ట్యాగ్ చేసిన సింగ్, సదరు ఎయిర్‌లైన్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.