Page Loader
Emergency Call: విమానాన్ని ముంబైకి మళ్లించే ముందు ఇండిగో పైలట్ నుంచి 'ప్యాన్‌..ప్యాన్‌'..  ఈ అత్యవసర కాల్ ఏమిటి?
విమానాన్ని ముంబైకి మళ్లించే ముందు ఇండిగో పైలట్ నుంచి 'ప్యాన్‌..ప్యాన్‌'.. ఈ అత్యవసర కాల్ ఏమిటి?

Emergency Call: విమానాన్ని ముంబైకి మళ్లించే ముందు ఇండిగో పైలట్ నుంచి 'ప్యాన్‌..ప్యాన్‌'..  ఈ అత్యవసర కాల్ ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

విమాన కాక్‌పిట్‌ నుంచి 'మేడే కాల్‌' వస్తే పరిస్థితి ఎంత భయంకరమో అందరికీ తెలుసు. కానీ నిన్న దిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఇండిగో (IndiGo) విమానంలో పైలట్‌ 'ప్యాన్‌.. ప్యాన్‌.. ప్యాన్‌ (PAN PAN PAN)' అనే సందేశాన్ని పంపించారు. ఆ సందేశం తర్వాత వెంటనే విమానాన్ని ముంబయిలో అత్యవసరంగా దిగించారు. అసలు ఈ సందేశానికి అర్థమేంటో తెలుసా? 'ప్యాన్‌ ప్యాన్‌ ప్యాన్‌' అనేది విమానాల్లో ఏర్పడిన అత్యవసర పరిస్థితిని తెలియజేసే రేడియో డిస్ట్రెస్‌ కాల్‌. అయితే ఇది 'మేడే కాల్‌' కంటే తక్కువ తీవ్రమైన స్థితిని సూచిస్తుంది. గగనతలంలో ఇంజిన్‌ సమస్యలు తలెత్తినప్పుడు, కానీ ప్రయాణికులకు ప్రాణాపాయం లేని సందర్భాల్లో,పైలట్లు ఈ సందేశాన్ని పంపిస్తారు.

వివరాలు 

రేడియో సంకేతం ద్వారా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం 

ఈ పదం ఫ్రెంచ్‌ భాషలోని 'Panne (ప్యాన్‌)' అనే పదం నుంచి వచ్చింది. దీని అర్థం 'బ్రేక్‌డౌన్‌' లేదా 'లోపం'. ఈ రేడియో సంకేతం ద్వారా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు 'విమానంలో సమస్య ఏర్పడింది.. అత్యవసర చర్యలు తీసుకోవాలి' అనే సమాచారాన్ని పంపిస్తారు. పరిస్థితి అంత తీవ్రమైనది కాకపోయినా,సమస్యను గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేయడానికే ఈ కాల్‌ ఉపయోగిస్తారు. ఉదాహరణకు,డబుల్‌ ఇంజిన్‌ ఉన్న విమానాల్లో ఒక ఇంజిన్‌ పనిచేయకుండా పోయినప్పుడు, మరొకటి పనిచేస్తున్న సందర్భాల్లో పైలట్లు ఈ సంకేతాన్ని పంపిస్తారు. ఈ సంకేతాన్ని అందుకున్న వెంటనే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ చురుకుగా స్పందిస్తుంది. గగనతలాన్ని ఖాళీ చేసి, విమానానికి అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.

వివరాలు 

ఇండిగో విమానానికి ఏమైంది అంటే.. 

అదేవిధంగా ఎయిర్‌పోర్టులో ఎలాంటి అపాయాలు జరగకుండా ఉండేందుకు అత్యవసర సేవలను సిద్ధం చేస్తుంది. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవా బయలుదేరిన ఇండిగో ఎయిర్‌బస్‌ ఏ320 నియో విమానంలో ఇదే సమస్య తలెత్తింది. గగనతలంలో ఉన్నప్పుడు ఒక్క ఇంజిన్‌ ఆగిపోవడంతో పైలట్‌ వెంటనే 'ప్యాన్‌.. ప్యాన్‌.. ప్యాన్‌' సందేశాన్ని పంపించారు. ఆ వెంటనే విమానాన్ని ఉదయం 9.53 గంటల సమయంలో ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్‌ చేయించారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ.. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ముంబయికి మళ్లించామని తెలిపింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

వివరాలు 

 రేడియో ద్వారా 'మేడే మేడే మేడే' 

ఇటీవల అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమానం నుంచి 'మేడే కాల్‌' రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. విమానం లేదా నౌక తీవ్రమైన ప్రమాదంలో చిక్కుకుని, అందులో ప్రయాణిస్తున్న వారిని రక్షించేందుకు తక్షణ సాయం అవసరమైనప్పుడు రేడియో ద్వారా 'మేడే మేడే మేడే' అంటూ సందేశాన్ని పంపిస్తారు. అహ్మదాబాద్‌ ఘటనలో కూడా టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే పైలట్‌ ఈ 'మేడే' సంకేతాన్ని పంపించారు. అయితే, ఏటీసీ నుంచి సమాధానం ఎలాంటి స్పందన రాలేదు. ఆ వెంటనే విమానం కుప్పకూలిపోయింది.