LOADING...
P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం
ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం

P Chidambaram: ఆపరేషన్ బ్లూస్టార్ పొరపాటు కారణంగా ఇందిరా గాంధీ ప్రాణాలు కోల్పోయారు : పి. చిదంబరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 12, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి సైన్యాన్ని ఉపయోగించడం తప్పుడు మార్గం అని ఆయన పేర్కొన్నారు. ఈ పొరపాటుకు అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రాణాలతో మూల్యం చెల్లించుకున్నారని చిదంబరం స్పష్టం చేశారు. కసౌలీలో జరిగిన సాహిత్య కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ సైనిక అధికారుల పట్ల నాకు ఎలాంటి అగౌరవం లేదు. కానీ స్వర్ణ దేవాలయం కోసం సైన్యాన్ని ఉపయోగించడం సరైన పద్ధతి కాదు. కొద్ది కాలం తరువాత సరైన పద్ధతిలో ప్రవర్తించడం ద్వారా సమస్య పరిష్కరించవచ్చునని మేమే చూపించాం.

Details

ఇందిరా గాంధీ తన జీవితాన్ని కోల్పోయారు

ఆపరేషన్ బ్లూస్టార్ తప్పు నిర్ణయం. ఆ తప్పు కారణంగా ఇందిరా గాంధీ తన జీవితాన్ని కోల్పోయారని చెప్పారు. అయితే ఆ నిర్ణయం కేవలం ఇందిరా గాంధీ తీసుకున్నదే కాకుండా, సైన్యం, పోలీసులు, నిఘా వర్గాలు, సివిల్ సర్వీస్ అధికారుల సమష్టి నిర్ణయం అని చిదంబరం వివరించారు. ప్రస్తుత పంజాబ్ పరిస్థితిని కూడా చిదంబరం విశ్లేషించారు. ఖలిస్థాన్ కోసం వేర్పాటువాద డిమాండ్లు దాదాపుగా కనిపించకపోవడం, రాష్ట్రానికి ప్రధాన సమస్య ఆర్థిక సమస్యలేనని తెలిపారు. పంజాబ్‌లో పర్యటించినప్పుడు అర్థమైంది, వేర్పాటువాదం దాదాపుగా చల్లబడింది. అసలు సవాలు ఇప్పుడు ఆర్థిక సమస్యలేనని ఆయన చెప్పారు.

Details

ఆపరేషన్ బ్లూస్టార్ నేపథ్యం 

1984 జూన్ 1-8 వరకు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ జరిగింది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత జర్నైల్ సింగ్ భింద్రాన్‌వాలే మరియు అతడి అనుచరులను ఆలయం నుంచి వెలికి తీసేందుకు ప్రభుత్వం సైనిక చర్యలు చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో వందలాది మంది మరణించగా, సిక్కుల మనోభావాలకు తీవ్ర దెబ్బ తగిలింది. ప్రతీకారంగా అదే ఏడాది అక్టోబర్ 31న ఇందిరా గాంధీని ఆమె సిక్కు బాడీగార్డులు హత్య చేశారు.