Loading...
Indiramma Towers: ఇందిరమ్మ టవర్లకు తొలిసారి TG RERA గుర్తింపు.. లబ్ధిదారులకు భరోసా
ఇందిరమ్మ టవర్లకు తొలిసారి TG RERA గుర్తింపు.. లబ్ధిదారులకు భరోసా

Indiramma Towers: ఇందిరమ్మ టవర్లకు తొలిసారి TG RERA గుర్తింపు.. లబ్ధిదారులకు భరోసా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం ఈ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో నిరుపేదల కోసం ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA)లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు తొలిసారిగా రెరాలో నమోదు కావడం విశేషం.

వివరాలు 

లబ్ధిదారులు నేరుగా రెరాను ఆశ్రయించవచ్చు

ఇందిరమ్మ టవర్ల నిర్మాణంలో జాప్యం జరిగినా, నాణ్యతా ప్రమాణాలు పాటించకపోయినా, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నా లబ్ధిదారులు నేరుగా రెరాను ఆశ్రయించవచ్చు.

ఈ మేరకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదులపై స్పందించే రెరా అధికారులు సంబంధిత నిర్మాణ సంస్థలకు నోటీసులు జారీ చేసి వివరణ కోరతారు.

బిల్డర్లు ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే అధికారం కూడా రెరాకు ఉంటుంది.

ఈ విధానం వల్ల నిర్మాణ పనుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతోపాటు లబ్ధిదారుల హక్కులకు రక్షణ లభించనుంది.

వివరాలు 

ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇందిరమ్మ టవర్ల నిర్మాణాన్ని చేపట్టింది.

ఇందులో ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి.

ఒక్కో నియోజకవర్గంలో నాలుగు టవర్ల చొప్పున నిర్మించనున్నారు. ఒక్కో టవర్‌లో 120 ఫ్లాట్లు ఉంటాయి.

ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో మొత్తం 480ఫ్లాట్లు నిరుపేదలకు అందుబాటులోకి రానున్నాయి.

ఒక్కో ఫ్లాట్ నిర్మాణానికి రూ.11 లక్షల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.5 లక్షలను సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుంది.

మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారులు విడతల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు గడువు విధించింది.

ADVERTISEMENT

వివరాలు 

నిర్మాణ సంస్థల పనితీరుపై రెరా పర్యవేక్షణ

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని ప్రకటించింది.

హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చేపడుతున్న ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టులకు తాజాగా తెలంగాణ రెరా రిజిస్ట్రేషన్ లభించింది.

నవంబర్ 23,సోమవారం రెరా చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి అనుమతి పత్రాలను హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ అందుకున్నారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులకు రెరా గుర్తింపు లభించడం కీలక పరిణామమని వీపీ గౌతమ్ పేర్కొన్నారు.

దీనివల్ల నిర్మాణ సంస్థలపై పర్యవేక్షణ పెరుగుతుందని,ప్రాజెక్టులపై లబ్ధిదారుల్లో నమ్మకం మరింత బలపడుతుందని తెలిపారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం,నిర్ణీత గడువులో ఫ్లాట్లను అప్పగించడం,ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు ఈ రిజిస్ట్రేషన్ ఉపయోగపడుతుందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

రెరా నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు, ఏజెంట్లు, నిర్మాణ ప్రాజెక్టుల కార్యకలాపాలను నియంత్రించడంతోపాటు ఆస్తులు కొనుగోలు చేసేవారి హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (RERA) చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లకు మించిన స్థలంలో చేపట్టే నిర్మాణ ప్రాజెక్టులు లేదా ఎనిమిదికి పైగా ఫ్లాట్లు ఉండే ప్రాజెక్టులు తప్పనిసరిగా రెరాలో నమోదు చేసుకోవాలి.

అలాగే నిర్మాణం కోసం సేకరించే నిధుల్లో కనీసం 70 శాతాన్ని ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో జమ చేయాలి.

దీనివల్ల ప్రాజెక్టు కోసం సేకరించిన డబ్బును ఇతర అవసరాలకు మళ్లించకుండా నియంత్రించవచ్చు.

వివరాలు 

రెరా నిబంధనలు ఏమి చెబుతున్నాయి?

ఒక ప్రాజెక్టుకు రెరా రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన తర్వాత దానికి సంబంధించిన అనుమతులు, నిర్మాణ వివరాలు, పనుల పురోగతి తదితర సమాచారాన్ని అధికారిక TG RERA వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు.

నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినా, ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను ఉల్లంఘించినా లేదా ఇతర సమస్యలు ఎదురైనా కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు.

ఇందిరమ్మ టవర్లకు కూడా ఈ విధమైన పర్యవేక్షణ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో లబ్ధిదారులకు తమ ఇళ్ల నిర్మాణం, నాణ్యత, గడువుపై ఫిర్యాదు చేసే అధికారిక వేదిక లభించినట్లయింది.

ADVERTISEMENT