Lepakshi Knowledge Hub: లేపాక్షి భూముల్లో పారిశ్రామిక పార్కు
వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి నాలెడ్జ్ హబ్. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ భూములను పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించాలని యత్నిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని లేపాక్షి భూముల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రతిపాదన పంపాయి. ఇందుకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మొత్తం 8,844 ఎకరాల భూమిని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోంది.
కేంద్రం అనుమతిని పొందడానికి ప్రయత్నాలు
ఈ భూములపై ఉన్న న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించడం కీలకమైందని అధికారులు చెబుతున్నారు. ఈడీ స్వాధీనం చేసుకున్న లేపాక్షి భూములను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించడానికి కేంద్రం అనుమతిని పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏపీఐఐసీ ఇప్పటికే భూములను వెనక్కు పొందేందుకు చర్యలు ప్రారంభించింది. హైకోర్టు, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కేసులను పరిష్కరించడం సాధ్యమవుతుందని లీగల్ సెల్ అధికారులు భావిస్తున్నారు.
ఓర్వకల్.. కొప్పర్తి తరహాలో
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖ-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా పలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా, 9 వేల ఎకరాల్లో ప్రతిపాదించిన ఓర్వకల్ పారిశ్రామిక పార్కు మొదటి దశ అభివృద్ధికి కేంద్రం అనుమతించింది. ఈ అభివృద్ధి కోసం రూ.2,796 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే, 5,754 ఎకరాల్లో ప్రతిపాదించిన కొప్పర్తి పారిశ్రామిక పార్కు మొదటి దశను రూ.2,140 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ఈ తరహాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేంద్ర భాగస్వామ్యంతో అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.