హెచ్3ఎన్2 వైరస్ కూడా కరోనా తరహాలోనే వ్యాపిస్తుంది; ఎయిమ్స్ మాజీ చీఫ్ హెచ్చరిక
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్-ఢిల్లీ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. కరోనా తరహాలోనే హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిస్తుందని చెప్పారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. హెచ్3ఎన్2 వైరస్ బింధువులు, తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతోందని పేర్కొన్నారు. హోళీ నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కేసుల పెరిగినా, ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే ఉన్నాయని వెల్లడించారు.
వైరస్ లక్షణాలు, వ్యాప్తి ఎలా ఉంటుందంటే
హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకిన వారిలో కేసులు గొంతు నొప్పి, దగ్గు, శరీర నొప్పులు, ముక్కు కారడంతో పాటు జ్వరం లక్షణాలు ఉంటాయని డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. వైరస్ పరివర్తనతో పాటు ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన హెచ్1ఎన్1 వైరస్ ఇప్పుడు హెచ్3ఎన్2గా రూపాంతరం చెందినట్లు గులేరియా వెల్లడించారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడమే వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం అని డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు తరచుగా చేతులు కడుక్కోవాలని, భౌతిక దూరం పాటించాలని వివరించారు.