INS Arighat: ఐఎన్ఎస్ అరిఘాత్.. భారతదేశ రెండో అణు జలంతర్గామి నేడు ప్రారంభం
భారతదేశం తన రెండవ అణు శక్తితో నడిచే జలాంతర్గామిని నేడు ప్రారంభించబోతోంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్ అని పిలిచే ఈ రెండవ అణు శక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని విశాఖపట్నంలో నేడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం,ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి,ఇండియన్ స్ట్రాటజిక్ కమాండ్ హెడ్ వైస్ అడ్మిరల్ సూరజ్ బెర్రీ, ఉన్నత DRDO అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ ఐఎన్‌ఎస్ అరిఘాత్ భారతదేశ మొదటి SSBN(షిప్,సబ్‌మెర్సిబుల్,బాలిస్టిక్,న్యూక్లియర్) జలాంతర్గామి అయిన ఐఎన్‌ఎస్ అరిహంత్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రూపొందించబడింది. తాజా జలాంతర్గామి భారతీయ నౌకాదళ శక్తిని మరింతగా పెంచబోతోంది,ముఖ్యంగా దేశం వ్యూహాత్మక అణు నిరోధక సామర్థ్యాలను మెరుగుపరచనుంది.
ఇందులో నాలుగు లాంచ్ ట్యూబ్స్
ఇది 4-SSBN ప్రాజెక్టు భాగం కింద అభివృద్ధి చేయబడింది.ప్రస్తుతం S4,S4* పేరుతో మరిన్ని జలాంతర్గాములు నిర్మాణంలో ఉన్నాయి. ఐఎన్‌ఎస్ అరిఘాత్ నీటి ఉపరితలంపై గరిష్టంగా 12-15 నాట్స్(22-28 కి.మీ/గంట)వేగంతో ప్రయాణించగలదు.నీటి లోపల 24 నాట్స్(44 కి.మీ/గంట)వరకు వేగాన్ని చేరుకోగలదు. ఇందులో నాలుగు లాంచ్ ట్యూబ్స్ ఉంటాయి.వీటితో క్షిపణులను ప్రయోగించవచ్చు.ఇది 3,500 కిలోమీటర్ల దూరం మించే పరిధి కలిగిన నాలుగు K-4 అణు సామర్థ్యం గల SLBMలను (సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్)లేదా 750 కిలోమీటర్ల పరిధి కలిగిన పన్నెండు K-15 SLBMలను మోసుకెళ్లగలదు. K-15క్షిపణులకు అణు వార్‌హెడ్‌ను అమర్చే సామర్థ్యం కూడా ఉంది.అదనంగా,అరిఘాత్ టార్పెడోలతో కూడిన రక్షణ వ్యవస్థలను కలిగి ఉంటుంది. 2017లో విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్(SBC)లో ఈజలాంతర్గామి నిర్మాణం ప్రారంభమైంది.