INS Tushil: ఇండో-రష్యన్ నౌకాదళ సహకారంలో కొత్త శకం.. ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌక
భారతీయ నౌకాదళంలోకి మరో కొత్త యుద్ధ నౌక ప్రవేశించనుంది. డిసెంబర్ 9న ఐఎన్ఎస్ తుషిల్ (INS Tushil) నౌకాదళంలో భాగమవుతోంది. రష్యాలోని కాలినిన్‌గ్రాడ్‌లో ఈ యుద్ధనౌక జలప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. క్రివాక్-3 క్లాస్ ఫ్రిగేట్‌కు చెందిన ఈ అప్‌గ్రేడ్ వర్షన్‌ను 1135.6 ప్రాజెక్ట్ కింద రూపొందించారు. ఇదివరకే ఇలాంటి ఆరు యుద్ధనౌకలు నౌకాదళంలో సేవలందిస్తున్నాయి. ఈ నౌకలు మూడు తల్వార్ క్లాస్, మరో మూడు టెగ్ క్లాస్‌గా విభజించబడ్డాయి. తల్వార్ క్లాస్ నౌకలను సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని బాల్టిస్కీ షిప్‌యార్డ్‌లో తయారు చేయగా, మిగిలిన మూడు నౌకలను కాలినిన్‌గ్రాడ్‌లోని యాంటర్ షిప్‌యార్డ్‌లో రూపొందించారు.
33 శాతం "మేడ్ ఇన్ ఇండియా" పరికరాల వినియోగం
తాజా సిరీస్‌లో ఏడవ యుద్ధనౌక ఐఎన్ఎస్ తుషిల్. ఈ నౌక తయారీకి 2016లో రోసోబోరన్ ఎక్స్‌పోర్ట్, భారత నౌకాదళం, భారత ప్రభుత్వ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ నౌక పొడవు 125 మీటర్లు,బరువు 3900 టన్నులు. రష్యా, భారత టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించారు. అత్యాధునిక డిజైన్‌తో స్టెల్త్ ఫీచర్లను సమకూర్చారు.ఈ డిజైన్ భారత నౌకాదళ నిపుణులు,సెవిరినోయి డిజైన్ బ్యూరో నిపుణుల సహకారంతో రూపొందించబడింది. 33 శాతం "మేడ్ ఇన్ ఇండియా" పరికరాలను వినియోగించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కేల్ట్రన్, నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, టాటా, ఎల్‌కోమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్ ఇండియా వంటి సంస్థలు ఈ నౌకలో ఉపయోగించిన పరికరాలను తయారు చేశాయి.