Manipur: మణిపూర్‌లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది కుకీ-మైతేయి వర్గాల మధ్య అట్టుడికిన ఘర్షణలు ఈసారి మరింత తీవ్రమయ్యాయి. రాకెట్, డ్రోన్ బాంబు దాడులతో రాష్ట్రంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. సోమవారం కూడా మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇక శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. తూర్పు, పశ్చిమ ఇంఫాల్ జిల్లాల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
అత్యవసర సేవలకు మినహాయింపులు
ఇక ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. కర్ఫ్యూలో అత్యవసర సేవలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ, ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. రాజ్‌భవన్ ఎదుట విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. డ్రోన్లు, క్షిపణుల దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, హింసను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.