Amaravati: పైప్ ద్వారా గ్యాస్ సరఫరా.. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ తరహా ప్రాజెక్టుకు ఐవోసీ ప్రతిపాదన
దేశంలో మొదటి పైప్‌లైన్ గ్యాస్ వినియోగించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రతిపాదించింది. పెట్రోలియం,నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) సభ్యుడు రమణకుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌తో సమావేశమై, రాష్ట్రంలో చేపట్టిన గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణ ప్రాజెక్టుల గురించి చర్చించింది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా గిఫ్ట్ సిటీ మాదిరిగా, అమరావతిలో అన్ని ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసి, రాజధానిని దేశంలో ఒక వినూత్న నమూనాగా మార్చడమే లక్ష్యమని ఐవోసీ బృందం వివరించింది. ఈ ప్రతిపాదనకు సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ అంగీకారం తెలిపారు.
80 లక్షల కనెక్షన్ల ప్రణాళిక
రాష్ట్రంలో భవిష్యత్తులో 80 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న లక్ష్యాన్ని ఏపీ గ్యాస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన పీఎన్‌జీఆర్‌బీ ప్రతినిధులతో ఆర్టీజీఎస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణ పురోగతి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనుల గురించి చర్చించారు. ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, పైప్‌లైన్ల నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తామని దినేశ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ కుమార్ ఆశిష్, ఐవోసీ జీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.