LOADING...
#NewsBytesExplainer: హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?
హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?

#NewsBytesExplainer: హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు దాని మూలాలు ఎక్కువగా హైదరాబాద్‌లో వెలుగులోకి రావడం గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది. పలుసందర్భాల్లో స్థానిక పోలీసులకు తెలియకుండానే ఇతర రాష్ట్రాల పోలీసులు హైదరాబాద్ నుంచి ఉగ్రదాడులకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని వెళ్లడం అనేక సార్లు జరిగింది. ఇదే తరహాలో మత్తు మందుల వ్యాపారం కూడా హైదరాబాద్ వైపు ఎక్కువగా దృష్టిపెడుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన కొన్ని గుబులు రేపిన ఘటనలు ఈ అనుమానాలను మరింత బలపరిచినట్టు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం మత్తు మందుల వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నట్టు అనిపించే పరిణామాలు గత కొన్ని నెలలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఒకప్రముఖ ప్రైవేటు యూనివర్సిటీలో విద్యార్థులు కొరియర్ ద్వారా మత్తు మందు తెప్పించుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

వివరాలు 

సరిగ్గా పని చేయని ప్రభుత్వ విభాగాలు

ఇది ప్రత్యేకించి ఒక పెద్ద యూనివర్సిటీ కావడం గమనార్హం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నార్కొటిక్ దందాపై విచారణ జరిపించి హడావుడి చేసినప్పటికీ ఆ కేసు కొన్నిరోజులకే అటకెక్కిపోయింది. రాష్ట్రంలో గత దశాబ్దకాలంగా నార్కొటిక్స్ వ్యాపారం గుట్టుగా సాగుతోందని అనేకులు ఆరోపిస్తున్నారు. పట్టుబడిన సందర్భంలో మాత్రమే ఈ విషయం వెలుగులోకి వస్తోంది, కానీ చాలా వరకు బయటకు రాకుండా ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగాలు చురుకుగా పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. వారు తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించి అనుమతులు, రెన్యూవల్స్, నామమాత్ర తనిఖీల పేరుతో లక్షల రూపాయలు దండుకుంటున్నారన్న విమర్శలు చాలా కాలం నుంచీ ఉన్నాయి.

వివరాలు 

కొంప ముంచుతున్న సంస్కరణలు 

గత కొన్ని సంవత్సరాలుగా పారిశ్రామికవేత్తల ఒత్తిడులు, వారిచ్చే విరాళాలకు తలొగ్గిన పాలకులు అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారు. పరిశ్రమల యజమానులు తనిఖీల నుంచి తప్పించుకునేలా నాలుగు రంగాల్లో పరిశ్రమలను విభజించారు: వైట్, గ్రీన్, ఆరెంజ్, రెడ్. వైట్, గ్రీన్ పరిశ్రమలపై తనిఖీలు తగ్గించి, ఆరెంజ్, రెడ్ వర్గానికి మాత్రమే నామమాత్ర తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ విధానం వల్ల పరిశ్రమల యజమానులు అధికారులను ముట్టడిస్తూ తమ గుట్టు వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీంతో సమాజ నాశనం అవుతోందని, చర్లపల్లి లాంటి ఘటనలు మున్ముందు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశముందని కాలుష్య నియంత్రణ శాఖలో పనిచేసిన ఒక అధికారి పేర్కొన్నారు.

వివరాలు 

నిద్రమత్తులో డ్రగ్ కంట్రోల్ అధికారులు 

ఫార్మా లేదా బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం అనుమతులు తీసుకున్న తరువాత ఆ కంపెనీలకు వెళ్లి నిరంతరం తనిఖీలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ డ్రగ్ కంట్రోల్ విభాగంపై ఉంది. అయితే మెడికల్ షాపులు, ఫిర్యాదు వచ్చిన చోట్ల మాత్రమే తనిఖీలు చేయడం జరుగుతూ, పరిశ్రమలపై సోదాలు జరిపే సంఘటనలు చాలా అరుదుగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఫార్మా ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ, కంపెనీల సంఖ్య,నియంత్రణ చర్యలపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది. మత్తు పదార్థాలపై యాంటి నార్కొటిక్స్ బ్యూరో ఏర్పాటు చేసినప్పటికీ పారిశ్రామిక వాడలపై స్పష్టమైన సమాచారం లేకపోవడం ప్రభుత్వ విభాగాల మధ్య అనుసంధానం లోపాన్ని సూచిస్తుంది.

వివరాలు 

టాలీవుడ్ డ్రగ్స్ కేసు గాలికి! 

డ్రగ్స్ బానిసైన వారు 40వేల వరకు ఉన్నారని అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు,ఐటీ ఉద్యోగులు, సంపన్న కుటుంబాల పిల్లలు ఎక్కువగా డ్రగ్స్ బానిసులుగా ఉన్నారు. కొరియర్ ద్వారా పదార్థాలు తెప్పించుకుంటున్న విద్యార్థుల పరిస్థితి చర్చనీయాంశమైంది. 2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి నటులు దగ్గుబాటి రానా, రకుల్ ప్రీత్ సింగ్, పూరి జగన్నాథ్, నవదీప్, సుబ్బరాజు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల కుమారులను విచారించి మొత్తం 12 కేసులు నమోదు చేశాయి. ఇక్కడ మనీలాండరింగ్‌ అంశంపై ఈడీ కూడా విచారణ జరిపింది.కానీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సరైన నమూనాలు పంపించని కారణంగా,కోర్టు ఆరు కేసులను కొట్టివేసింది. ఎక్సైజ్ శాఖ పరిపాలన వైఫల్యం ప్రదర్శించినట్టు కోర్టు పేర్కొన్నది.

వివరాలు 

చర్లపల్లి ఫ్యాక్టరీ నేపథ్యం

శుక్రవారం మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఐదో ఫేజ్ నవోదయ కాలనీలో మెఫిడ్రిన్ మత్తు పదార్థం తయారు చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి కంపెనీ నుంచి రూ.11.58 కోట్ల విలువైన మెఫిడ్రిన్, 35,500లీటర్ల రసాయనాలు,950 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గుట్టు ఫ్యాక్టరీ వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌ వాసులు షాక్‌కు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం ముంబయిలో ఫాతిమా మురాద్ షేక్‌ను అరెస్ట్ చేసి ఆమె ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు వ్యాపారం చర్చనీయాంశమైంది.

వివరాలు 

చర్లపల్లి ఫ్యాక్టరీ నేపథ్యం

మహారాష్ట్ర పోలీసులు వాగ్ధేవీ ల్యాబోరేటరీస్‌పై ఆకస్మిక దాడి చేసి యజమాని వోలేటీ శ్రీనివాస్ విజయ్, సహాయకుడు పండరీనాథ్ పట్వారీ లను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించారు. వాస్తవానికి, ఈ స్థలాన్ని నాలుగేళ్ల క్రితం జలంధర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి లీజుకు తీసుకొని ఫార్మా ఉత్పత్తులు తయారు చేస్తున్నానని చెప్పి మెఫిడ్రిన్ తయారీ చేసినట్టు గుర్తించారు.