Page Loader
Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్! 
తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!

Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 18, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, మరోసారి ఈ అంశం చర్చల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఏడాదికి పైగా గడిచినా, ఇంకా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. గతంలో ఉగాది నాటికి విస్తరణ జరుగుతుందని ఊహాగానాలు వచ్చినప్పటికీ, అమలుకాకపోవడం నిరాశకు గురిచేసింది. తాజా పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ మళ్లీ తెరపైకి రావడం విశేషం.

Details

ఈ నెలాఖరు లేదా జూన్ మొదటివారంలో విస్తరణ? 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో విస్తరణపై అంచనాలు బలంగా నెలకొన్నాయి. నిజామాబాద్‌లో శనివారం మాట్లాడిన ఆయన, తుది నిర్ణయం హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో మంత్రివర్గ విస్తరణ ఈసారి జరగడం ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. ఇంకా ఆరు ఖాళీలు డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు మంత్రిపదవులు ఖాళీగానే ఉన్నాయి. ఈ విషయం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశావహులు కూడా అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలంతా పూర్తిస్థాయి కేబినెట్ అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Details

ఎన్నికల కోడ్ వల్ల ఆలస్యం

సార్వత్రిక ఎన్నికల కారణంగా విస్తరణ వాయిదా పడింది. ఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ పాలనపై దృష్టి కేంద్రీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు పూర్తిస్థాయి కేబినెట్‌పై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. అయితే పలు రాజకీయ సమీకరణాలు, సామాజిక ప్రతినిధ్యం వంటి అంశాల కారణంగా ఇంకా నిర్ణయం తీసుకోలేకపోయారు.

Details

ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం - కొత్త ఆశావాహులు

ప్రస్తుతం కేబినెట్‌లో నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ విస్తరణలో ఆ జిల్లాలకు న్యాయం జరగాల్సిందేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాకు ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్ రెడ్డి పేరు చర్చలో ఉంది. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు, కానీ ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేబినెట్‌లో ఉన్నారు. ఇద్దరికి మంత్రి పదవి కల్పిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Details

ఇతర జిల్లాల నుంచి రేసులో ఉన్న నేతలు 

ఆదిలాబాద్‌ నుంచి జి.వివేక్‌, ప్రేమ్ సాగర్ రావులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ జిల్లాకు ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి కూడా ఒకరికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అయితే అక్కడ పార్టీకి విజయం అందించిన ఎమ్మెల్యేలు లేరు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో గెలిచిన దానం నాగేందర్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది కూడా పోటీలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు కీలకం ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే ఎస్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు కూడా అవకాశం ఉందన్న వార్తలున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పరిగి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారు.

Details

 గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు? 

ఆరు ఖాళీలు మాత్రమే ఉండటంతో... ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఎంపికలు సవాళ్లుగా మారాయి. హైకమాండ్ ఇప్పటికే అనేక సమీక్షలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే పలువురి పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. అవసరమైతే ప్రస్తుతానికి నాలుగు ఖాళీలను భర్తీ చేసి, మిగిలిన రెండింటిని తర్వాత భర్తీ చేసే ఆలోచన కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోపు పూర్తిగా స్పష్టత రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.