LOADING...
BCCI: 'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది
'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది

BCCI: 'సైనికుల రక్తం కంటే డబ్బే ముఖ్యమా?'.. బీసీసీఐపై మండిపడ్డ ఎంపీ ప్రియాంక చతుర్వేది

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌ 2025లో భారత్‌ - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య హైఓల్టేజ్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది బీసీసీఐపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ఆమె ఆదివారం ఓ పోస్ట్‌ చేస్తూ భారత సైనికుల ప్రాణాలు, పౌరుల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యం అయ్యిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌బస్టర్‌ ఫిక్సర్‌! సెప్టెంబర్‌ 14న భారత్‌-పాక్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ చేశారు. మరోసారి సూపర్‌ ఫోర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లలో కూడా ఈ జట్లు తలపడే అవకాశముంది. తోటి భారతీయులు, సైనికుల రక్తం కంటే బీసీసీఐకి డబ్బే ముఖ్యమైపోయింది.

Details

లెజెండ్స్‌ టోర్నీలో మ్యాచ్ రద్దు

బీసీసీఐ సంపాదించాలనుకుంటున్నది కేవలం రక్తపు సొమ్ము మాత్రమే కాదు, వినాశకరమైన డబ్బు కూడా అంటూ ఆమె విమర్శించారు. గతంలో జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాకిస్థాన్‌తో ఉన్న పలు ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. ఈ ఘటన తరువాత ఇరుదేశాల మధ్య క్రీడా సంబంధాలపై కూడా ప్రభావం పడింది. ఇటీవల జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ లెజెండ్స్‌ టోర్నీలో పాకిస్తాన్‌ జట్టుతో మ్యాచ్‌ ఆడేందుకు భారత్‌ నిరాకరించడంతో ఆ మ్యాచ్‌ రద్దైంది.

Details

సెప్టెంబర్ 14న దుబాయ్‌ వేదికగా భారత్ - పాకిస్థాన్ మ్యాచ్

అయితే ఇదే తరుణంలో ఆసియా కప్ 2025 షెడ్యూల్‌ విడుదల కావడం, అందులో భారత్ - పాక్ మ్యాచ్‌లను మళ్లీ ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14న దుబాయ్‌ వేదికగా భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే టోర్నమెంట్ ఫైనల్‌ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది. అలాగే అబుదాబి వేదికగా కూడా కొన్ని ఆసియా కప్‌ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లపై ఇప్పటికే పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా, ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి.