#NewsBytesExplainer: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన మావోయిస్టుల ఆధిపత్యం.. ఉనికి ప్రశ్నార్థకమా?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకత్వం గత రెండు దశాబ్దాలుగా ప్రభావశీలంగా కొనసాగింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు అగ్రనేతలు ఎన్‌కౌంటర్ మరణించగా, మరికొందరు వయోభారం, అనారోగ్య సమస్యలతో బలహీనపడుతున్నారు.
మావోయిస్టు ఉద్యమం ప్రస్తుతం మనుగడ కోసం తీవ్ర పోరాటాన్ని కొనసాగిస్తోంది.
మనుగడ కోసం పోరాటం
మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలతో తీవ్ర పోరాటంలో నిమగ్నమై ఉన్నారు.
అగ్రనాయకత్వాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అధిక దృష్టి సారిస్తున్నారు.
మావోయిస్టు సిద్ధాంతాలపై నూతన సభ్యులకు తగిన శిక్షణ అందించే కార్యక్రమాలు క్రమంగా తగ్గుతున్నాయి.
Details
సీపీఐ (మావోయిస్టు) ఉద్భవం
2004 సెప్టెంబర్ 21న సీపీఐ (మావోయిస్టు) ఏర్పాటైంది.
ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉన్న సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రాలుగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) విలీనం ద్వారా ఈ పార్టీ అవతరించింది.
దీనికి 2003 నుంచే చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ విలీన ప్రకటన హైదరాబాద్‌లో జరిగింది.
పొలిట్ బ్యూరో బలోపేతం
సీపీఐ (మావోయిస్టు) ఏర్పాటైనప్పుడు 16 మంది సభ్యులతో కూడిన బలమైన పొలిట్ బ్యూరో ఉండేది. 34 మంది సభ్యులతో కూడిన కేంద్ర కమిటీ కూడా శక్తివంతంగా పనిచేసేది.
2004లో పొలిట్ బ్యూరోలో తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.
Details
తెలుగు రాష్ట్రాల నుంచి అగ్రనాయకులు
చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, నంబాల కేశవరావు, సందె రాజమౌళి, మళ్ల రాజిరెడ్డి, అక్కిరాజు హరగోపాల్ (ఆర్కే) వంటి వారు కీలక పాత్ర పోషించారు.
2021 ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, 21 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణ, ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుగా ఉన్నారు.
మేథో బలం
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన మావోయిస్టు నేతలలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, న్యాయవాద వృత్తి, పీహెచ్‌డీ వంటి విద్యార్హతలు కలిగిన వారు ఉండటం విశేషం.
వీరు మార్క్సిజం, లెనినిజం, మావోయిస్టు సిద్ధాంతాలను శిక్షణ ద్వారా కార్యకర్తలకు అందించారు.
Details
గ్రేహౌండ్స్ ప్రభావం
2005-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రేహౌండ్స్‌ను ఏర్పాటు చేసి మావోయిస్టులపై దాడులను ముమ్మరం చేసింది. దీంతో మావోయిస్టు ఉద్యమం తెలుగు రాష్ట్రాల్లో క్షీణించింది.
భద్రతా బలగాల ఒత్తిడితో మావోయిస్టు అగ్రనేతలు ఛత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లోకి వెళ్లిపోయారు.
ఎన్‌కౌంటర్‌లో మృతులు, లొంగుబాట్లు
సందె రాజమౌళి, చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్), మల్లోజుల కోటేశ్వర్ రావు (కిషన్ జీ), పటేల్ సుధాకర్ రెడ్డి వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో మరణించారు.
జినుగు నరసింహా రెడ్డి (జంపన్న), నార్ల రవిశర్మ, తక్కళ్లపల్లి వాసుదేవ రావు వంటి పలువురు లొంగిపోయారు.
ఫలితంగా మావోయిస్టుల అగ్రనాయకత్వంలో తెలుగు నేతల సంఖ్య తగ్గిపోయింది.
Details
ప్రస్తుత అగ్రనాయకులు
ఛత్తీస్‌గఢ్ పోలీసుల తాజా సమాచారం ప్రకారం, ఇప్పటికీ 14 మంది తెలుగు మావోయిస్టు నాయకులు ఉన్నారు.
నంబాల కేశవరావు, ముప్పాళ్ల లక్ష్మణరావు, మల్లోజుల వేణుగోపాల్, తిప్పర్తి తిరుపతి, కడారి సత్యనారాయణ రెడ్డి, మోడెం బాలకృష్ణ, గాజర్ల రవి వంటి వారంతా కీలక నేతలుగా ఉన్నారు.
వయోభారం, ఆరోగ్య సమస్యలు
ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతల వయసు పైబడింది. ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ 70 ఏళ్లు, ముప్పాళ్ల లక్ష్మణరావుకు 76 ఏళ్లు. మరికొందరు 60 ఏళ్లు దాటారు.
మావోయిస్టు పార్టీ యువనాయకత్వాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కొత్త నాయకులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు తక్కువగానే ఉన్నారు.
Details
మావోయిస్టుల భవిష్యత్తు
జంపన్న ప్రకారం, ఇప్పటికీ మావోయిస్టు పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదు. కానీ, ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో స్థానిక నాయకత్వం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాబోయే కాలంలో మావోయిస్టు ఉద్యమంలో తెలుగు నేతల పాత్ర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.